స‌ర‌స్వ‌తీ పుత్రుడు: జేఈఈ ఫ‌లితాల్లో క‌ల్పిత్‌కు 100శాతం మార్కులు

పుత్రోత్సాహము తండ్రికి..పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ..పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ అని సుమ‌తీ శ‌త‌కంలో చ‌దివే ఉంటాం. బిడ్డ పుట్టిన‌ప్పుడు క‌న్న క‌లిగే సంతోషం..ఆ బిడ్డ సాధించిన విజ‌యాన్ని ప్ర‌జ‌లు పొగుడుతూ ఉంటే ఆ త‌ల్లిదండ్రుల‌కు నిజ‌మైన సంతోషం క‌ల్గుతుంద‌ని దీన‌ర్థం. అదే జ‌రిగింది రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో కాంపౌండ‌ర్‌గా పనిచేసే పుష్ప‌లాల్ అనే తండ్రికి.త‌న కొడుకు  క‌ల్పిత్ వీర్వ‌ల్‌ గురువారం విడుద‌లైన జేఈఈ మెయిన్ ఫ‌లితాల్లో 100 శాతం మార్కులు సాధించి టాప‌ర్‌గా నిలిచాడు. 360 మార్కుల‌కు 360 మార్కులు సాధించ‌డంతో త‌న త‌ల్లిదండ్రులు సంతోషంతో ఉబ్బి త‌బ్బిబ‌వుతున్నారు.

తాను టాప‌ర్‌గా వ‌స్తాన‌నే న‌మ్మ‌కం ప‌రీక్ష రాసిన వెంట‌నే క‌లిగింద‌ని చెప్పుకొచ్చాడు క‌ల్పిత్‌. అయితే 360కి 360 మార్కులు వ‌స్తాయ‌ని ఊహించ‌లేక‌పోయిన‌ట్లు చెప్పాడు క‌ల్పిత్. అయితే వ‌చ్చే నెల‌లో జరిగే అడ్వాన్స్‌డ్‌పై దృష్టి సారించిన‌ట్లు క‌ల్పిత్ వెల్ల‌డించాడు. త‌న స‌క్సెస్ వెన‌క సీక్రెట్ ఏమీ లేద‌ని క్ర‌మం తప్ప‌కుండా త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వ‌డం… టీచ‌ర్లు చెప్పింది శ్ర‌ద్ధ‌గా విని రోజుకు ఐదారు గంట‌లు చ‌ద‌వ‌డ‌మేన‌ని క‌ల్పిత్ చెప్పుకొచ్చాడు.