హక్కుల పరిరక్షణలో మేం ముందున్నాం
– అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్
మిన్నేపోలిస్,మే27(జనంసాక్షి): తెలంగాణ నూతన రాష్ట్రంగా ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోందని ఆ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం వినూత్య కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్… వరుస సమావేశాలతో తలమునకలై ఉన్నారు. మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నేపోలిస్ నగరంలో పర్యటించిన ఆయన… అక్కడి వాణిజ్య కార్యాలయం, బోస్టన్ సైంటిఫిక్, కార్గిల్ మెడ్‌ట్రోనిక్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడి భారత సంఘాలతో సమావేశమయ్యారు.తెలంగాణ అభివృద్ధి కోసం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం, రోడ్ల నిర్మాణం, ఫించన్ల పథకం గురించి వివరించారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ మిన్నెసోటా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన సమావేశానికి పెద్దసంఖ్యంలో భారత సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ… మిషన్ కాకతీయలో భాగంగా 45వేల చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించడమే ధ్యేయమని ఉద్ఘాటించారు. పరిశ్రమలను ఆకర్షించడమే ధ్యేయంగా ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.




