‘హద్దు’మీరితే ఖబర్దార్
పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
న్యూఢిల్లీమే27(జనంసాక్షి):
భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. పాక్ తమ దేశ ప్రజల శ్రేయస్సును కోరుకుంటే భారత్ విషయాల్లో తలదూర్చవద్దని స్పష్టంగా సందేశం పంపినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని జమ్మూలో జనకల్యాణ్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ మాట్లాడుతూ భారతదేశం ఖ్యాతికి, సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఏమాత్రం భంగం కలిగించినా ఊరుకునేది లేదని.. అలాంటి వారికి తగిన సమాధానం చెప్పి తీరుతామని స్పష్టంచేశారు. ఇంతకాలం తాము పరస్పర సహకారానికి తోడ్పాటు ఇచ్చామన్నారు. భారత సైన్యంపై, పార్లమెంటరీ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలకు స్నేహ హస్తమే అందిస్తుందని.. పాకిస్థాన్ సహా పొరుగుదేశాలతో మైత్రి బంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే పాక్ అందుకు వ్యతిరేకంగా ఉందన్నారు. పాకిస్థాన్ తమ సొంత సంక్షేమం కాంక్షిస్తే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. కుతంత్రాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. ఎవరితోనా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే భారత్ భూభాగంపై ఎవరైనా పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తే సహించబోమని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఏళ్లకు ఏళ్లు తాత్సారం చేసిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాదిలో 40 రక్షణ ఒప్పందాలు ఖరారు చేసిందనిరాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వ్యవస్థను భ్రష్టు పటిస్తే, ఎన్డీఏ సర్కారు పారదర్శకత పెంచిందని చెప్పారు.