హఫీజ్‌ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష

ఇస్లామాబాద్‌,నవంబరు 19(జనంసాక్షి):ముంబై 26/11 ఉగ్రదాడి సూత్రధారి, జమాత్‌-ఉల్‌-దవా ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్తాన్‌ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లా¬ర్‌ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్‌తో పాటు జాఫర్‌ ఇక్బాల్‌, యహ్యా ముజాహిద్‌ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది.కాగా 2008లో ముంబై తాజ్‌ ¬టల్‌లో హఫీజ్‌ పెంచి పోషించిన ఉగ్రబృందం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది. గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.