హమాస్‌ కీలక కమాండర్‌ హతం

డ్రోన్‌ దాడిలో చంపేశాం : ఐడీఎఫ్‌
గాజా భూభాగంలోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్‌ సైన్యం
పౌరులు వీడివెళ్లాలంటూ ఆదేశాలివ్వడంపై ఐరాస అభ్యంతరం
గాజా, అక్టోబర్‌14 (జనంసాక్షి)
గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్‌ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌) హతమార్చాయి. డ్రోన్‌ దాడిలో టాప్‌ కమాండర అలీ ఖాదీని డ్రోన్‌ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఇతను హమాస్‌ అత్యంత ముఖ్యమైన ఎలైట్‌ గ్రూప్‌ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్‌ 7న గాజా నుంచి ఇజ్రాయిల్‌ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్‌. ‘ఖచ్చితమైన ఐడీఎఫ్‌, ఐఎస్‌ఏ నిఘా సమాచారం మేరకు ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానం హమాస్‌ ‘నుఖ్బా’ కమాండో ఫోర్స్‌2కి చెందిన కంపెనీ కమాండర్‌ అలీ ఖాదీని హతమార్చింది’ అంటూ ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఎక్స్‌(ట్విట్టర్‌)లో ప్రకటించింది. 2005లో ఇజ్రాయిల్‌ పౌరులను కిడ్నాప్‌, హత్యలకు పాల్పడిన అలీ ఖాదీని ఇజ్రాయిల్‌ అరెస్ట్‌ చేసింది. అయితే గిలాడ్‌ షాలిత్‌ ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదల చేయబడ్డాదని ఇజ్రాయిల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తెలిపింది. ఇజ్రాయిల్‌ లో అక్టోబర్‌ 7న అమానవీయ, అనాగరికమైన పౌరుల ఊచకోతకు అలీ ఖాదీ నాయకత్వం వహించాడు, మేము అతడిని అంతమొందించాం. మిగతా హమాస్‌ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్‌ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్‌ వైమానికి దళానికి చీఫ్‌ గా ఉన్న మరో ఉగ్రవాది హమాస్‌ వైమానిక దళాల చీఫ్‌ మురాద్‌ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయిల్‌ నివేదించింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇజ్రాయిల్‌-పాలస్తీనా హమాస్‌ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలైంది. గత శనివారం హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 1300 మంది చనిపోగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. హమాస్‌ ఉగ్రవాదులు 150 మంది వరకు ఇజ్రాయిలీలను బందీలుగా తీసుకుని గాజాకు తరలించారు. మరోవైపు ఇజ్రాయిల్‌ గాజా స్ట్రిప్‌ పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడిలో వేల సంఖ్యలో మంది చనిపోయారు.
గ్రౌండ్‌ ఆపరేషన్‌ షురూ..
హమాస్‌ గ్రూపును  సమూలంగా మట్టుపెట్టే ప్లాన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ ‘గ్రౌండ్‌ ఆపరేషన్‌’ ప్రారంభించింది. గాజా భూభాగంలోకి తమ బలగాలు, యుద్ధ ట్యాంకులు ప్రవేశించినట్టు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌(ఐడీఎఫ్‌) ఇప్పటికే ప్రకటించింది. ఉగ్రవాదులను మట్టుపెట్టడంతోపాటు ఇజ్రాయెల్‌ నుంచి బందీలుగా తీసుకెళ్లిన వారి ఆచూకీ కోసం ‘స్థానిక ఆపరేషన్‌’ ప్రారంభించినట్టు తెలిపింది. పలు టెర్రరిస్టులను తమ బలగాలు విజయవంతంగా హతమార్చాయని, బందీల ఆచూకీకి సంబం ధించి సమాచారం సేకరించాయని పేర్కొన్నది. అయితే ఇజ్రాయెల్‌ బలగాలు గాజా భూభాగం లోపలికి ఇంకా పూర్తిగా వెళ్లలేదని ‘చానెల్‌ 12’ నివేదించింది. మరోవైపు హమాస్‌ మిలిటెంట్లను పూర్తిగా ఏరివేసే పక్రియ చేపట్టేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఉత్తర గాజా రీజియన్‌లో ఉంటున్న దాదాపు 11 లక్షల మంది పాలస్తీనియన్‌ పౌరులు 24 గంటల్లో వెంటనే ఆ ప్రాంతాన్ని వీడి, దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. గాజా సిటీకి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఉత్తర గాజాలో అక్కడ పౌరుల మధ్య ఉంటూ కార్యకలాపాలను నడుపుతున్న హమాస్‌ మిలిటెంట్లను ఒక్కొక్కరిగా అంతమొందించే చర్యలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడినట్టు పలు విూడియా కథనాలు వెల్లడిరచాయి. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జనాభాను వారు ఉంటున్న ప్రాంతాన్ని వీడాలని ఆదేశాలు ఇవ్వడంపై ఐక్యరాజ్యసమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు  మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని అభిప్రాయ పడిరది. ఇజ్రాయెల్‌ అటువంటి ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్‌ డుజారిన్‌ అన్నారు.