హమాస్ చీఫ్‌పై ఇజ్రాయెల్ గురి
తమపై దాడుల్లో సిన్‌వార్‌దే కీలక పాత్ర
ప్రపంచానికే అతడు శత్రువంటూ ట్వీట్
ఏమాత్రం సహించబోమంటూ ఐడీఎఫ్ హెచ్చరిక
లెబనాన్ (జనంసాక్షి)
గాజాలో హమాస్ అగ్రనేతపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) గురిపెట్టింది. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడుల్లో అతడు కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. అతడు తమ దేశానికే కాదు.. ప్రపంచం మొత్తానికి శత్రువు అంటూ ఐడీఎఫ్ ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేసింది. అతడే యాహ్యా సిన్‌వార్..! అతడు, అతడి అనుచరులు తమ లక్ష్యాల్లో ఉన్నారని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి వెల్లడిరచారు.
యాహ్యా అసలు పేరు ‘యహ్యా ఇబ్రహీం హస్సన్ సిన్‌వార్’. అతడు 1962లో గాజాలోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. అతడి పూర్వీకులు 1948 వరకు నేటి దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. అప్పట్లో ఈ ప్రదేశం ఈజిప్ట్ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత సిన్‌వార్ కుటుంబం గాజాకు తరలివెళ్లింది. అతడు గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. సిన్‌వార్ రెండు దశాబ్దాల పాటు జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరంపై తొలిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్‌లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్ విభాగం అభియోగాలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సిన్‌వార్ 1988లో అరెస్ట్ కాగా.. 1989లో ఇతడికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత పలు మార్లు జైలు నుంచి తప్పించుకోవడానికి యత్నించి దొరికిపోయాడు. 2008లో ఇతడి మెదడులో కణితి రావడంతో శస్త్రచికిత్స చేశారు. 2011లో ఇతడి జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. 2006లో హమాస్ అపహరించిన గిలియద్ షలిట్ అనే సైనికుడి కోసం 2011లో ఇజ్రాయెల్ మొత్తం 1,026 మందిని విడుదల చేసింది. వీరిలో సిన్‌వార్ కూడా ఉన్నాడు.
ముఖ్యంగా మిలిటరీ వింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. 2015లో సిన్‌వార్‌ను అమెరికా విదేశాంగశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. హమాస్‌లోని అల్ కస్సామ్ బ్రిగేడ్ల ఏర్పాటుకు ముందున్న సంస్థను ఇతడే ఏర్పాటు చేసినట్లు అమెరికా వెల్లడిరచింది. ప్రస్తుతం హమాస్ మిలటరీ విభాగంలో అల్ కస్సామ్ బ్రిగేడ్లు కీలకమైనవి. 2017లో అతడు గాజాలో హమాస్‌కు అధిపతిగా ఎన్నికయ్యాడు. హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరోకు ఇస్మాయిల్ హనియా అధ్యక్షుడు. అతడు స్వచ్ఛందంగా ప్రవాసంలో ఉంటున్నాడు. దీంతో గాజాపట్టీలో అప్రకటిత పాలకుడు సిన్‌వారే. అతడు ఇజ్రాయెల్ రాజీని అంగీకరించడని.. దాడులకే మొగ్గు చూపుతాడనే పేరుంది. హమాస్‌లోని అన్ని ర్యాంకుల వారు సంస్థకు పూర్తి విధేయతతో ఉండాలని బలంగా కోరుకుంటాడు. ఈ క్రమంలో కిందిస్థాయి ఆపరేటీవ్‌లపై నిఘా పెడుతుంటాడు. ఇందులో భాగంగానే అతడు హమాస్ కమాండర్ మహమ్మద్ ఇషిత్విని హత్య చేయించాడు. అతడు నైతికంగా నేరానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. ఇషిత్వి స్వలింగసంపర్కం నెరిపే అలవాటు కారణంగానే అతడిని చంపించినట్లు తెలుస్తోంది. ఈ బలహీనతతో అతడిని ఎవరైనా తమ స్వప్రయోజనాలకు వాడుకొంటారనే భయంతోనే ఈ హత్య చేయించాడు. ఇజ్రాయెల్‌పై దాడుల్లో సిన్‌వార్ కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ ఆరోపిస్తోంది. శనివారం ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ రిచర్డ్ హెక్ట్ మాట్లాడుతూ ‘’ సిన్‌వార్ రాక్షసుడు. ఈ దాడుల మాస్టర్‌మైండ్ అతడే’’ అని వెల్లడిరచారు. సిన్‌వార్‌ను ఇజ్రాయెల్ ఏమాత్రం సహించదని చెప్పారు. సిన్‌వార్‌తో సహా అతడి బృందం మొత్తం మా లక్ష్యాల జాబితాలో ఉందన్నారు.