హమ్మయ్యా..ఓటమి నుంచి బయట పడ్డారు!
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి బయట పడింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా అతికష్టం మీద గట్టెక్కింది. ఓ దశలో ఓటమి దిశగా పయనించిన టీమిండియాను అజ్యింకా రహానే, భువనేశ్వర్ జోడీ కాపాడింది. ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా మరో ఓటమి బారిన పడకుండా కాపాడి తమవంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు.
ఈ ఆఖరి మ్యాచ్ పై తొలుత ఇరు జట్లు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాచివరకు డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. 349 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలో లక్ష్యం దిశగా పయనించినట్లు కనిపించింది. టీమిండియా ఓపెనర్ , గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (16)లు చేసి ఆదిలోనే పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలోమురళీ విజయ్ (80, రోహిత్ శర్మ(39) పరుగులు చేసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం విరాట్ కోహ్లీ(46), సురేష్ రైనా(0), సాహా (0) వికెట్లను వరుసగా కోల్పోయిన టీమిండియా స్వల్ప వ్యవధిలో కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ కు మరో విజయానికి చేరువగా పయనించింది.
కాగా అజ్యింకా రహానే తన మార్కు ఆటను ప్రదర్శించి ఆసీస్ అటాకింగ్ ను అడ్డుకున్నాడు.88 బంతులను ఎదుర్కొన్న రహానే ఐదు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అతనికి జతగా భువనేశ్వర్ కుమార్ (20) పరుగులు చేసి టీమిండియా ఓటమిని అడ్డుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ , లయన్ లకు తలో రెండు వికెట్లు దక్కగా, హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కగా వాట్సన్ వికెట్ లభించింది. ఇప్పటికే రెండు టెస్టులను గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ ను కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్ బోర్న్, సిడ్నీ టెస్టులు మాత్రం డ్రాగా ముగిశాయి.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 572/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 251/6 డిక్లేర్
భారత తొలి ఇన్నింగ్స్ 475, రెండో ఇన్నింగ్స్ 252/7