హరితహారంలో పోలీస్ శాఖ చురకుగా పాల్గొనాలి
పర్యావరణం కోసం మట్టి వినాయకులకే ప్రాధాన్యం: ఎస్పీ
ఆదిలాబాద్,ఆగస్ట్2(జనం సాక్షి): హరితహారంలో పోలీస్ శాఖ తమ టార్గెట్ మేరకు మొక్కలునాటి సంరంక్షించాలని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి జిల్లాకు పూర్వవైభవం తీసుకరావాలని పిలుపునిచ్చారు. అడవులతోనే జీవ జాతులకు మనుగడ ఉంటుందని అన్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పోలీసుశాఖ ద్వారా నిర్దేశంచిన లక్ష్యానికి మించి మొక్కలు నాటి అన్ని శాఖల్లో కన్నా ముందంజలో నిలిచేందుకు సిబ్బంది కృషిచేయాలన్నారు. గత హరితహారం కార్యక్రమాల్లో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని, జిల్లా పోలీసు కార్యాలయం, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్, జైనథ్, తలమడుగు, ఇచ్చోడ, పలు పోలీస్‌స్టేషన్లలో మొక్కలు ఏపుగా పెరిగి పార్కులను తలపిస్తున్నాయన్నారు. ఇకపోతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల ప్రతిమల వైపు భక్తుల ప్రోత్సహించాలని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేలకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారని తెలిపారు. జిల్లాలో విగ్రహాలను తయారు చేస్తూ రాష్ట్రంలో గుర్తింపు పొందిన కళాకారులు ఉన్నారని, గతంలో జిల్లాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలకు భారీ డిమాండ్ ఉండేదన్నారు. ఇటీవల రాజస్థాన్
నుంచి కొందరు కళాకారులు వచ్చి పీవోపీతో విగ్రహాలు తయారు చేస్తున్నారని, దీంతో మట్టి ప్రతిమలకు ఆదరణ తగ్గిందని తెలిపారు. పీవోపీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో చాలా మార్పు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మట్టి ప్రతిమలకు మరింత ఆదరణ పెరిగి పునన్ వైభవం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందిచాలని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే జిల్లాలో మట్టి విగ్రహాలపై అవగాహన కార్యక్రమాలతో భక్తులను చైతన్యవంతం చేశామని తెలిపారు.