హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌,జూన్‌27(జ‌నం సాక్షి): హరితహారం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ అన్నారు. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం మూడో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. మొక్కలు నాటడమే లక్ష్యమని, ఇందుకోసం ఇప్పటికే అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జులై మొదటి వారంలో వాతావరణ అనుకూల పరిస్థితుల ఆధారంగా మొక్కలు నాటేందుకు అన్నిశాఖల అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో విడత హరితహారం కార్యక్రమంలో గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా ప్రచారం చేయనున్నట్లుతెలిపారు. అన్ని గ్రామాల్లో హరితహారంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి హరితహారంలో అందరూ భాగస్వాములు అయ్యేలా ప్రచారం చేస్తామన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మొదటి విడతలో భాగంగా ఐదు రోజుల్లో టేకు స్టంపులు ఎంపీడీవో కార్యాలయాలకు చేరుతాయన్నారు. వాటిని గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు ఏఈవోలు రైతు సర్వే నంబరు ప్రకారం జాబితా తయారు చేసుకోవాలన్నారు. మొక్కలు పంపిణీకి రిజిష్టర్లు నిర్వహించాలని సూచించారు. రైతు పేరు, సర్వే నంబరు, ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలని అన్నారు. టేకు మొక్కలు పెంచడంతో రైతులకు వచ్చే లాభాలను వివరించాలన్నారు. మొక్కలు ఎక్కువ పెంచితే రైతుకు ఈజీఎస్‌ నుంచి లేబర్‌ను ఇస్తామని వారికి కూలీ రైతు ఇవ్వాలని అన్నారు.