హరితహారంలో భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, యువకులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నాటిన మొక్కలకు అటవీశాఖ అధికారులతో మాట్లాడి ట్రీ గార్డులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అడవుల శాతంపెంచేందుకు అమలు చేస్తున్న హరితహారం పథకం ప్రగతిలో వెనకబాటును అధిగమించాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మొక్కల ప్రగతిలో పురోగతి లేదని, గుంతల తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. నర్సరీల్లో చిన్న మొక్కలు ఉండటంతో తీసుకెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపడంలేదని పేర్కొన్నారు. లక్ష్య సాధన కోసం ఎత్తు పరిమాణం ఉన్న మొక్కలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ప్రజలు నివాస గృహాల్లో పండ్ల మొక్కలు పెంచేందుకు మొగ్గుచూపుతుండటంతో ఆ దిశగా అధికారులు మొక్కల కొనుగోలు చేయాలన్నారు. వర్షాలు రాకముందే అందుబాటులో ఎన్ని మొక్కలు ఉన్నాయి…? ఎన్ని మొక్కలు అవసరమో ప్రతిపాదించుకుని తీసుకురావాలన్నారు.