హరితహారం కోసం జిల్లా సన్నద్దం
వర్షాలు పడడంతో అనుకూలంగా వాతావరణం
నిజామబాద్,జూలై16(జనం సాక్షి ): హరితహారానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నట్లు వెల్లడిరచారు. జిల్లావ్యాప్తంగా ఈసారి కోటి లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడంలో జిల్లాను ముందువరుసలో నిలపాలని పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా అటవీశాఖ, మండల స్థాయి అధికారులకు మొక్కల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వర్షృాలు బాగా పడినందున మొక్కల పెంపకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని భాగస్వామ్యం చేయనున్నారు. దీనిలో హరితరక్షణ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు ఈ మేరకు లక్ష్యాలను వివరించారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించే బాధ్యత ఆశాఖ వారిదేనని స్పష్టంచేశారు. ఆయాశాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలని ఇప్పటికే ఆదేశించారు. వివిధ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించి అడవులతో పాటు గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయా లక్ష్యాల కనుగుణంగా పనిచేయాల న్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు బాగా కురుస్తుండటంతో హరితహారానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గతరెండు నెలల నుంచి వివిధ శాఖల ఆధ్వర్యంలో నర్సరీల్లో పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ, డీఆర్‌డీవో, హార్టికల్చర్, మున్సిపాలిటీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నర్సరీల పెంపకాన్ని చేపట్టారు. ఆయా శాఖల ఆధ్వర్యలో చేపట్టిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఆయా మండలాల్లో మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇళ్లలో పెంచుకు నేందుకు పండ్లు, పూలు ఇతర మొక్కలను సైతం అధికారులు పంపిణీ చేయనున్నారు. మొక్కలను నాటాల్సిన ప్రదేశాలను సైతం అధికారులు గుర్తించారు. ప్రధానంగా బ్లాక్ ప్లాంటేషన్‌లతో పాటు అటవీ ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులు ఎవెన్యూ ప్లాంటేషన్, గుట్టలు, ఎత్తైన ప్రదేశాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పరిసరాలు, ఇళ్ల ఆవరణలో, ఆలయాలు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు, ఫైర్ స్టేషన్లు, స్మృతి వనాలు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టనున్నారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను హరిత రక్షణ కమిటీలోని ఉద్యోగులు చూడాల్సి ఉంటుంది.