హరితహారం మహా ఉద్యమం

– 8న నల్గొండ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం
– ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై 4(జనంసాక్షి): హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహా సంకల్పానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా రాష్ట్ర సరిహద్దుల వరకు సుమారు 165 కిలోవిూటర్ల మేర మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 8న నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. మంత్రుల, ఎమ్మెల్యేలు,ఎంపిలు తమతతమ ప్రాంతాల్లో మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు ఒకే సమయంలో 85వేల మొక్కలు నాటనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఔషధ మొక్కలు అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల 11 నుంచి ఔషధ మొక్కల పంపిణీ చేయడానికి కౌంటర్లను ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్క్, పీపుల్స్ ప్లాజా, హైటెక్‌సిటీ, చార్మినార్, ఉప్పల్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తదితర ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 8న నల్లగొండ జిల్లాలో జరిగే హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర జరిగే హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. సీఎం మొక్కలు నాటే సమయంలో ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటే విధంగా ప్రణాళిక రూపొందించారు. అదే రోజు తమతమ జిల్లాల శాఖ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు మొక్కలు నాటి ప్రారంభిస్తారు. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంట అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కోదాడ మండలం నల్లబండగూడెం వరకు 165 కి.విూ మేర రోడ్డుకు ఇరువైపులా అందమైన పూలచెట్లు, నీడనిచ్చే మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రహదారిని 14 సెగ్మెంట్లుగా విభజించింది. 14 సెగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి 10 కిలోవిూటర్ల మేర ఒకే రకం, ఒకే రంగు మొక్కలు నాటాలని నిర్ణయించారు.



