హరితహారాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు

C

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఆగస్టు 1(జనంసాక్షి):తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ప్రజా ప్రతినిధులు, అధికారులు మరింత అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. హరితహారంపై హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ సవిూక్ష జరిపారు.రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన హరితహారంపై అధికారులు సమర్పించిన నివేదికలతో పాటు వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సవిూక్షించారు. మొక్కలు నాటాలనే ఉత్సాహం ప్రజల్లో చాలా పెరిగిందని, బాగా వర్షాలు పడుతున్నాయని, హరితహారం కార్యక్రమానికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ శాఖలు బాగానే పనిచేస్తున్నప్పటికీ కొద్దిమందిలో ఉదాసీనత ఉందని ఆయన గుర్తుచేశారు. సమావేశం నుంచే మంత్రులతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లాల్లో ఏ ఎమ్మెల్యే బాగా పాల్గొంటున్నారో, ఎవరు పాల్గొనడం లేదో మంత్రులకు వివరించారు. అందరూ కలిసి బాగా పని చేయాలని సూచించారు.భూభాగంలో 33 శాతం అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మొక్కల పెంపకాన్ని శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా చూడాలే తప్ప? వేరే కార్యక్రమంగా భావించకూడదని అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలను వచ్చే జూన్‌ వరకు కాపాడితే అవి బతికినట్టే అన్నారు. వేసవి కాలంలో మొక్కలకు నీరు పోసేందుకు ఫైర్‌ ఇంజిన్లు, వాటర్‌ ట్యాంకర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నింటినీ ఇందులో భాగస్వామ్యం చేయాలని అన్నారు. జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామాల వారీగా మొక్కలు నాటడం, వాటిని రక్షించడంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.ప్రతీ డివిజన్‌ కు ఒక అటవీ శాఖ సీనియర్‌ అధికారిని ఇన్‌ చార్జ్‌ గా నియమించి హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. గ్రామ స్థాయిలో హరితహారం వివరాలపై ప్రతీ రోజూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సవిూక్ష జరపాలని ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డిని ఆదేశించారు. అధికారుల పనితీరుకు, ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించేందుకు హరితహారంలో వారి భాగస్వామ్యం కొలమానం అవుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. హరితహారంలో బాగా పని చేసిన వారికి ఆగస్టు 15 వేడుకల్లో హరితమిత్ర అవార్డులు ప్రదానం చేస్తామని ప్రకటించారు.