హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి
భవిష్యత్ తరాల కోసమే హరితహారం కార్యక్రమం
సిఎం కెసిఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలి
మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డ పిలుపు
నిజామాబాద్,ఆగస్ట్1 జనంసాక్షిః భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ లో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, సిఎం నిర్ధేశిరచిన లక్ష్యాన్ని చేరాలన్నారు. తెలంగాణను హరిత తెలంగాణ చేసే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ హరితహారం పథకం రూపొందించి మొక్కలు నాటాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలను కోరారు. ఈ సంవత్సరం విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించామని తెలిపారు. విద్యాలయాల్లో ఉన్న ఖాళీ స్థలాలు గుర్తించి పక్కా ప్రణాళిక రూపొందించి మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యా యులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై హరిత పాఠశాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటి ఆవరణలో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థులతో పాటు ఈ మొక్కలు పెరిగి, పెద్దవై మంచి భవిష్యత్ ఇస్తాయన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాన్ని పూర్తిగా దున్ని, లే అవుట్ చేసి మొక్కలను పద్దతి ప్రకారం నాటాలని అధికా రులకు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల వైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. తెలంగాణలో భాగస్వామ్య ప్రజలు, చిత్తశుద్ధి ఉన్నఅధికారులు ఉండడం వల్లే ఈ పథకాలు విజయవంతమై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. అదేవిధంగా నిజాం కాలం నాటి చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరిస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలని ఈ హరితహారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ హరితహారం కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సిఎం కేసిఆర్ నిర్ధేశించిన లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.