హరిత విప్లవం రావాలి
– జయశంకర్ యూనివర్సిటీ కీలకభూమిక పోషించాలి
– సీఎం కేసీఆర్
హైదరాబాద్ ఆగస్టు4(జనంసాక్షి):
వ్యవసాయ రంగం సంక్షోభంలో వుందని హరిత విప్లవంతో పూర్వ వైభవం తేవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం కీలక పాత్ర పోషించాలని సూచించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో కూలంకుషంగా సవిూక్ష జరిపారు. 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వ్యవసాయంతోనే గ్రావిూణ జీవితం ముడిపడి వుందన్నారు. పట్టణాల అవసరాలు కూడా వ్యవసాయం ద్వారానే తీరాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇంత గొప్ప పాత్ర ఉన్న వ్యవసాయ రంగం అనుకున్న రీతిగా అభివృద్ది చెందడం లేదని, వ్యవసాయ శాఖ రైతులను బాగుపరచడంతో పాటు.. ఆహార ఉత్పత్తుల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించే విధంగా సరైన ప్రణాళికతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణలో వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం, వైవిధ్యం కలిగిన నేలలు, మంచి వర్షపాతం ఉన్నాయని, వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేసుకోవాలని, కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. మొత్తంగా వ్యవసాయశాఖలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ, ఆధునీకరణ పెరగాలని, రాష్ట్రంలోని వ్యవసాయ క్షేత్రాలను క్రాప్ కాలనీలుగా గుర్తించి విభజించాలని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యవసాయ శాఖ కూడా అందుకు అనుగుణంగా తమ కార్యక్రమాలను విస్తరించుకోవాలన్నారు. తెలంగాణలో రెండు పంటలు పండే కాలం వస్తున్నదని, ఇది రైతులకు మరింత లాభం చేకూర్చే విధంగా మార్చే బాధ్యత వ్యవసాయ శాఖదే అని సీఎం కేసార్ చెప్పారు.
తెలంగాణలో వివిధ రకాల స్వభావాలున్న నేలలు ఉన్నాయని, వీటిని క్రాప్ కాలనీలుగా మార్చి విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. విత్తనాల ఉత్పత్తికి అనువైన ప్రాంతం కాబట్టే ఇక్రిశాట్ ను హైదరాబాద్ లో పెట్టారని, 500 లకు పైగా విత్తనోత్పత్తి కంపెనీలు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోనే విత్తనోత్పత్తికి అత్యంత అనువైన ప్రాంతం తెలంగాణ అని, ఈ పరిస్థితిని రైతులు కూడా వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చే కార్యక్రమంలో రైతులందరిని భాగస్వాములను చేయాలని సూచించారు. ఏ ప్రాంతంలో, ఏ నేలలో, ఏ రకం పంట వేయాలో అధికారులు నిర్ణయించి రైతులకు చెప్పాలని, సాగు పద్దతులపై కూడా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
గతంలో వ్యవసాయ యూనివర్సిటికి ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, రైతులు యూనివర్సిటీకి క్యూ కట్టి మరీ విత్తనాలు తీసుకుపోయేవారన్నారు. కానీ, ఇప్పుడు రైతులు, యూనివర్సిటీల మధ్య సమన్వయమే లేదని, సంబంధం తెగిపోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో పరిశోధనలు పెరగాల్సింది పోయి తగ్గిపోవడం మంచి పరిణామం కాదన్నారు. వ్యవసాయ యూనివర్సిటీలో పరిశోధనలు పెరగాలని, దానికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ ఒకప్పుడు దేశంలోనే అగ్రశ్రేణిలో ఉండేదని, ఇప్పుడు ఆ వైభవం లేదన్నారు. యూనివర్సిటీకి పూర్వ వైభవం తేవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతిపాదిస్తే ప్రభుత్వం అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సెర్చ్ కమిటీ నియమించి వీసీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యూనివర్సిటీలో వ్యవసాయ పరిశోధనలు పెరగాలని, యూనివర్సిటీ పరిధిలోని భూముల్లోనే కాకుండా ప్రొఫెసర్లు, విద్యార్థులు అన్ని జిల్లాల్లో పర్యటించి పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా భూసార పరీక్షలు చేయిస్తామని, దానికి అనుగుణంగా ఎక్కడ ఏ పంటలు వేయాలో రైతులకు సూచించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ శాఖలో కూడా విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా మండల స్థాయిలో నియమించుకోవాలని చెప్పారు. వ్యవసాయ శాఖలో ఎన్ని ఉద్యోగాలు అవసరమో నిర్ణయించి ప్రతిపాదించాలని, త్వరలోనే నియామకాలు జరుపుతామని సీఎం చెప్పారు. వ్యవసాయ శాఖలో అవసరమైన మేరకు ఆగ్రానమిస్టులను కూడా నియమించుకోవాలని సూచించారు.
సంప్రదాయ వ్యవసాయమే కాకుండా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ పద్దతుల్లో మార్పులు రావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున కూరగాయల అవసరం ఉందని, తెలంగాణలో రైతులు కూరగాయలు ఎక్కువగా పండించకపోవడం వల్ల 90 శాతం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల పరిసర వ్యవసాయ భూముల్లో కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కూరగాయలు అవసరం? ఎన్ని పప్పు దినుసులు కావాలి? ఎంత ధాన్యం పండించాలి? ఎన్ని నూనె గింజలు కావాలి? ఇంకా ఇతర ఆహార ఉత్పత్తుల అవసరం ఎంత ఉంది? అనే విషయంపై శాస్త్రీయమైన అంచనా రూపొందించుకొని దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప, దిగుమతి చేసుకునే అవసరం రావద్దని చెప్పారు.
వ్యవసాయంలో పనిచేయడానికి ప్రస్తుతం మనుషుల కొరత ఉందని, భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ అవుతుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయంలో యాంత్రీకరణ అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. మారుతున్న కాలంతో పాటు మారాలని, యాంత్రీకరణ, ఆధునీకరణ వ్యవసాయ రంగంలో పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సూక్ష్మ సేద్యం పై కూడా అవగాహన పెంచాలని సూచించారు.
వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు బాగా పెరగాలని, మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని నేలలపై యూనివర్సిటీకి సంపూర్ణ సమాచారం, అవగాహన ఉండాలన్నారు. అప్పుడే ఎక్కడ ఏ పంట వేయాలి? ఎక్కడ ఎలాంటి వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించాలి? అనే విషయంపై అంచనాలు రూపొందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అటు వ్యవసాయ శాఖకు, ఇటు వ్యవసాయ యూనివర్సిటీకి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి అత్యంత ఉపయుక్తమైన పెట్టుబడిగా భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా లాటరైట్ నేలలు ఉన్నాయని, ఇవి పండ్ల తోటల పెంపకానికి ఎంతో దోహదపడతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి నేలలను గుర్తించి, రైతులను చైతన్య పరిచి, పండ్లతోటలు పెంచేలా ప్రోత్సహించాలని సూచించారు. పంటలు పండించడమే కాకుండా, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం కోసం కూడా అవసరమైన మార్కెటింగ్ వ్యూహాన్ని అవలంభించాలన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ రైతుల తరహాలో సరైన మార్కెటింగ్ వ్యూహం ఉంటే రైతులు లాభం పొందుతారన్నారు. ఏ పంట ఎక్కడ పండించాలి అనే విషయం ఎంత ముఖ్యమో పండిన పంటను ఎక్కడ మార్కెట్ చేయాలి? ఎక్కడ అవసరం ఉంది? అనేది కూడా గుర్తించడం ముఖ్యమని సీఎం చెప్పారు.
మార్క్ ఫెడ్ ను కూడా ఇంకా బాగా వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులు కేవలం పంటలు పండించి అమ్ముకోవడమే కాకుండా, ఆ ఉత్పత్తులకు మరింత బాగా మార్కెట్ చేసుకునేందుకు అవసరమైన వాల్యూ ఆడిషన్ పద్దతులు కూడా నేర్పాలని అధికారులను కోరారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాల ఉత్పత్తి కూడా పెరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన విధానాన్ని రూపొందించాలని, ప్రతి గ్రామంలో రైతులతో వ్యవసాయ శాఖ ప్రత్యక్ష అనుబంధం కలిగి వుండాలని, ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ శాఖకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.
ఈ సవిూక్షలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె. సిన్హా, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, వ్యవసాయ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ రావు, రీసర్చ్ డైరెక్టర్ రాజారెడ్డి, హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రతాపం, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.