హరీశ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాలి

` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి
` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి
` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం
` నూతనంగా ఎంపికైన గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించిన సీఎం
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టులపై చర్చ పెడితే అసెంబ్లీకి రాకుండా భారాస నాయకులు పారిపోయారు. హరీశ్‌రావు అధికారమిస్తే చేసి చూపిస్తానంటున్నారు పదవి రావాలంటే ఆయన మరో ఔరంగ జేబు అవాతరం ఎత్తాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.’’భారాస కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే విూకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి భారాసను గద్దె దించారు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదు. దోచుకున్నది.. దాచుకోవడంపైనే దృష్టిపెట్టారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు. కాగ్‌ నివేదికను సభలో పెట్టాం.త్వరలో గ్రూప్‌`1 పరీక్ష నిర్వహిస్తాం. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నాం. అధికారం చేపట్టిన 70 రోజుల్లోనే దాదాపు 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది కేవలం 6శాతం మాత్రమే. దాన్ని 10 నుంచి 12శాతానికి పెంచి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తాం’’ అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ తండాలో పాఠశాల
` బీటీ రోడ్లు నిర్మిస్తాం
` సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు
` ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతున్న బంజారాలు
` బంజారాలను ఎస్టీల్లో ఇందిరా గాంధీ చేర్చారు
` సేవాలాల్‌ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ లో సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్‌ విగ్రహానికి పూలమాలుల వేశారు. ఆయనకు నివాళులు అర్పించారు. బంజారాలను ఎస్టీల్లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ చేర్చారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. అందువల్లే సివిల్‌ సర్వీసుసహా అనేక ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఆదివాసీలు తెలంగాణలో ఉద్యమంలో చురగ్గా పాల్గొన్నారు. సీతక్కకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని చెప్పారు. సంత్‌ సేవాలాల్‌ జయంతి రోజు ఆఫ్షనల్‌ హాలీడే ఇచ్చామన్నారు.సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఇస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాల్లో సింగిల్‌ టీచర్‌ పాఠశాలలను మూసివేసిందని విమర్శించారు. అన్ని తండాల్లో , గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్‌ శ్రీసేవాలాల్‌ మహరాజ్‌. నాగరిక సమాజానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చారాయన. సాంఘిక సమానత్వం కావాలని ఆకాంక్షించారు. బంజారాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని గడ్డమాంగలూరు గ్రామానికి చెందిన రామావత్‌ భీమా నాయక్‌, ధర్మిణి దంపతుల తొలిసంతానం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌. ఆయన 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి బళ్లారిలోని గుత్తి రాంజీనాయక్‌ తండాలో జన్మించారు. సేవాలాల్‌ చిన్నతనం నుంచి భక్తి భవాలు కలిగి ఉన్నారు. గిరిజనులను ఏకం చేసేందుకు జాతి సన్మార్గంలో పయనించేలా ఆధ్యాత్మిక ప్రచారం నిర్వహించారు. సేవాలాల్‌ మహరాజ్‌ మహిమలను నవాబ్‌ ఉస్మాన్‌ పాషా నమ్మారట. అందుకే హైదరాబాద్‌ లో కొంత ప్రాంతాన్ని ఇచ్చారని అంటారు. అదే నేటి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ అని చెబుతుంటారు. అలా బోధనలు చేస్తూ సేవాలాల్‌ మహరాజ్‌ మహారాష్ట్రలోని రాయగాడ్‌ జిల్లాలో సమాధి అయ్యారు. సేవాలాల్‌ మహరాజ్‌ సమాధి రాయగాడ్‌ బంజారాల పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. ఈ ప్రాంతాన్ని పౌరఘడ్‌, సేవాఘడ్‌గా పిలుస్తారు. ప్రతి తండాలో తప్పనిసరిగా సేవాలాల్‌ మహరాజ్‌ మందిరాన్ని నిర్మించికున్నారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో గిరిజనులు పయనిస్తున్నారు.