హర్మన్‌ప్రీత్‌కు అభినందనలు

ట్విటర్‌ వేదికగా క్రీడా ప్రముఖుల అభినందనలు

ముంబయి: కరీబియన్‌ దీవుల్లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ వేటను భారత్‌ ఘన విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని మహిళల జట్టు 34పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేలోపే మూడు వికెట్లు చేజార్చుకున్న భారత్‌ను.. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(103; 51బంతుల్లో 7్ఖ4, 8్ఖ6) ముందుండి నడిపించింది. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వచ్చిన హర్మన్‌.. కుదురుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పదే పదే క్రీజు వదిలి బయటికి వస్తూ భారీ షాట్లు ఆడింది. అదే జోరు చివరి దాకా కొనసాగించి.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో టీ20ల్లో భారత్‌ తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌వుమన్‌గా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు ట్విటర్‌ వేదికగా హర్మన్‌ను అభినందించారు.

 

1. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున తొలి శతకం సాధించిన హర్మన్‌ప్రీత్‌కు అభినందనలు. తొలి మ్యాచ్‌నే ఇంత గొప్పగా బోణీ కొట్టడం నిజంగా అద్భుతం. రోడ్రిగ్స్‌తో కలిసి హర్మన్‌ ప్రీత్‌ చక్కగా బ్యాటింగ్‌ చేసింది.

– రోహిత్‌ శర్మ, భారత క్రికెట్‌ తాత్కాలిక కెప్టెన్‌.

 

2. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టుకు అభినందనలు. హర్మన్‌ ప్రీత్‌ మరోసారి బ్యాట్‌తో దీపావళి ధమాకా చూపించింది.

– వీరేంద్ర సెహ్వాగ్‌, భారత మాజీ క్రికెటర్‌.

 

3. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత మహిళల జట్టుకు ప్రత్యేక అభినందనలు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ తన అద్భుత శతకంతో జట్టును ముందుండి నడిపించింది. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ జట్టు ఇదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నా.

– వీవీఎస్‌ లక్ష్మణ్‌, భారత మాజీ క్రికెటర్‌.

 

4. తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చక్కటి ఆరంభం. హర్మన్‌ ప్రీత్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.

– మహ్మద్‌ కైఫ్‌, భారత మాజీ క్రికెటర్‌.

 

5. స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో హర్మన్‌ ప్రీత్‌ క్రీజు వదిలి ముందుకు వచ్చి షాట్లు ఆడిన విధానం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఆట చూడలేదు.

– ఆకాశ్‌ చోప్రా, భారత మాజీ క్రికెటర్‌.

 

6. 51బంతుల్లో 103పరుగులు.. టీ20ల్లో భారత్‌ తరఫున మహిళా క్రికెట్‌లో తొలి సాధించిన హర్మన్‌ ప్రీత్‌కు అభినందనలు.

– కేదార్‌ జాదవ్‌, భారత క్రికెటర్‌.

 

7. టీ20ల్లో మహిళా క్రికెట్‌లో భారత్‌ తరఫున తొలి శతకం సాధించిన బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు అభినందనలు.

– బీసీసీఐ.

 

8. గయానాలో భారత్‌ తరఫున హర్మన్‌ ప్రీత్‌ తొలి శతకం సాధించి చరిత్ర సృష్టించింది.

– ఐసీసీ.