హర్వేనుంచి కోలుకోని టెక్సాస్‌, లూసియానా

– నీటి మునిగిన పలు ప్రాంతాలు

హ్యుస్టన్‌,,సెప్టెంబర్‌ 1,(జనంసాక్షి):హరికేన్‌ హార్వే నుంచి టెక్సాస్‌, లూసియానా ఇంకా తేరుకోలేదు. హార్వే బీభత్సం సృష్టించి వారం రోజులు గడిచినా వరదలు మాత్రం తగ్గడం లేదు. లూసియానా ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. టెక్సాస్‌ లో కొన్ని ప్రాంతాలు మినహా చాలా వరకు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక హ్యుస్టన్‌ లో వరద నీరు కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఆరు రోజులుగా నదులను తలపించిన రోడ్లు ఇప్పుడిప్పుడే సాధారణ స్థాయికి వచ్చాయి. చాలా వరకు రోడ్లన్నీ వాహన రాకపోకలతో బిజీ అయ్యాయి. వరద బాధితుల కోసం బస్సు సేవలను అధికారులు పునరుద్దరించారు. షాపింగ్‌ మాల్స్‌, డిపార్టుమెంటల్‌ స్టోర్లు కూడా తెరుచుకున్నాయి. దాంతో నిత్యావసర సరుకుల కోసం జనం దుకాణాలకు వస్తున్నారు. అయితే పూర్తిగా కోలుకోడానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉందని హ్యుస్టన్‌ మేయర్‌ చెప్పారు.