హలో విద్యార్థి.. చలో కరీంనగర్
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 13(జనం సాక్షి)
– నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం
– తొలి రోజు ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ
– ముఖ్యఅతిథులుగా రానున్న రాజ్యసభసభ్యులు డాక్టర్.వి.శివదాసన్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
– ఇప్పటికే నగరమంతా ప్రదర్శించిన భారీ స్వాగత తోరణాలు, భారీ హోర్డింగ్‌లు
——————————
‘చదువుతూ పోరాడు.. చదువు కోసం పోరాడు’ అన్న నినాదంతో ‘హలో విద్యార్థి.. చలో కరీంనగర్’ పిలుపుతో అఖిల భారత విద్యార్థి సంఘం (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర నాలుగో మహాసభలు నేటి నుంచి అంగరంగవైభవంగా ప్రారంభంకానున్నాయి. నేడు ఉదయం 11గంటలకు తెలంగాణచౌక్ నుంచి వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రదర్శన ప్రారంభించి సభాస్థలి వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పేరుతో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం అంగరంగవైభవంగా ముస్తాబైంది. ముఖ్యఅతిథులుగా ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మాజీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్.వి.శివదాసన్ సహా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరుకాబోతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధ్యం వహిస్తూ 700 మంది సంఘం ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. నగరమంతా లాల్‌నీల్ రంగుల జెండాలు, స్వాగతతోరణాలు, మహాసభల పోస్టర్లు, భారీ హోర్డింగ్‌లు మహాసభల వైభవానికి అద్దంపడుతుండగా.. సుమారు వంద మందికిపైగా విద్యార్థినేతలు మంగళవారం అర్ధరాత్రివరకూ ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభ అనంతరం అదేరోజు సాయంత్రం 3గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రతినిధుల సమావేశాలు 15, 16 తేదీల వరకూ జరగనున్నాయి. సుమారు విద్యారంగం సమస్యలపై సుమారు 25 అంశాల పట్ల తీర్మానాలు చేసి రాబోయే మూడేండ్లకాలంలో భవిష్యత్ పోరాట ప్రణాళికలను రూపొందించుకోనున్నారు. ఇక చివరి రోజున ప్రతినిధులంతా కలిసి రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.
అమరుల పేర్లతో మహాసభల ప్రాంతాలు
మహాసభ బహిరంగ సభాస్థలికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పేరును నామకరణం చేశారు. ప్రతినిధుల సమావేశాలు జరిగే ప్రాంతానికి విద్యార్థి ఉద్యమాల్లో అమరులైన జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు కన్నూరి రమేష్ నగర్‌గా, సమావేశాల్లో ప్రతినిధులు ఆసీనులయ్యే ప్రాంతానికి పసూలమారుతి భవన్‌గా నిర్ణయించారు.
సభలో పాల్గొనే వక్తలు.. కార్యక్రమాల వివరాలు..
– బుధవారం ఉదయం 11గంటలకు తెలంగాణ చౌక్ నుంచి ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభాస్థలివరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ
– మహాసభలో ప్రముఖులు, ముఖ్యఅతిథులుగా వచ్చే రాజ్యసభ సభ్యులు డాక్టర్ వి.శివదాసన్, జాతీయ అధ్యక్షులు వి.పి.సాను సహా జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టీ.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కన్వీనర్ ఎం.పూజ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, శనిగరపు రజనీకాంత్‌లు ప్రసంగించనున్నారు.
– సభల సందర్భంగా ప్రముఖుల సందేశాలు.. విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయ దారులపై ప్రసంగించనున్నారు. వీరితోపాటు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు సౌహార్థ సందేశాలు ఇవ్వనున్నారు.
– మర్నాడు గురువారం, శుక్రవారం (ఈనెల 15, 16తేదీల్లో) రోజుల్లో నగరశివారులోని శుభంగార్డెన్స్‌లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. చివరి రోజున ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.