హస్తిన అతలాకుతలం

` చెరువులను తలపిస్తున్న రోడ్లు
` స్తంభించిన దిల్లీ.. దశాబ్దంలోనే రికార్డు స్థాయి వర్షపాతం!
దిల్లీ(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి.ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సాధారణంగా అక్టోబరులో దిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే, తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గత 24 గంటల్లో దిల్లీలో కురిసిన వర్షపాతం రికార్డు నెలకొల్పిందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ ఉపాధ్యక్షుడు మహేశ్‌ పలావట్‌ తెలిపారు. గత దశాబ్దకాలంలో దిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురవలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటి వరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయాయన్నారు. సోమవారం నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. దిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
(14 వరకు తెలంగాణలో భారీ వర్షాలు..
` రాష్ట్రంలో ఎల్లో అలర్ట్‌ జారీ..! )
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో.. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.