హార్వే నష్టం.. రూ.3లక్షల కోట్లు

హ్యూస్టన్: అమెరికాలో హార్వే హరికేన్ ప్రభావం ఐదో రోజూ కొనసాగింది. టెక్సాస్, లూసియానా రాష్ర్టాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. వరదలు ముంచెత్తుతుండడంతో హ్యూస్టన్ నగరం విలవిలలాడుతున్నది. వేల మంది నిర్వాసితులవు తున్నారు. మరోవైపు సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. హరికేన్ మృతుల సంఖ్య 30కి చేరిందని, అందులో ఓ భారతీయ విద్యార్థి ఉన్నారని అధికారులు తెలిపారు. శనివారం టెక్సా స్ రాష్ట్రం హ్యూస్టన్‌లోని బ్రయాన్ సరస్సులో నిఖిల్ భాటియా (24), షాలినీ సింగ్ (25) మునిగిపోతుండగా అధికారులు రక్షించి దవాఖానకు తరలించారు. నిఖిల్ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. షాలిని పరిస్థితి విషమంగా ఉన్నది. మరోవైపు బుధవారం లూసియానాలో హార్వే హరికేన్ మరోసారి తీరం దాటింది. టెక్సాస్‌లోనే అత్యధిక జనాభా కల హ్యూస్టన్ నగరం ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నది. సహాయ బృందాలు 3,500 మందిని కాపాడాయి. నేరగాళ్లు రెచ్చిపోతూ వాహనాలను దొంగిలించడంతోపా టు, దుకాణాలను లూఠీ చేస్తున్నారు.

దీంతో రాత్రుళ్లు కర్ఫ్యూ విధిస్తున్నట్టు హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ప్రకటించారు.చార్లెస్ సరస్సు ప్రమాదకర స్థాయికి చేరిందని హెచ్చరించారు. హార్వే హరికేన్ అమెరికాలోనే అత్యంత వినాశకర తుఫాన్లలో ఒకటరి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ అన్నారు. టెక్సాస్‌లో వరద బాధితులను ఆదుకోవడంలో ఎన్నారైలు ముందుంటున్నారు. దాదాపు 100 మంది ఎన్నారై వలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్, మద్రాస్ పోవిలియన్ రెస్టారెంట్ కలిపి 500 మందికి ఆహారం అందిస్తున్నాయి. వరదలతో హ్యూస్టన్ యూనివర్సిటీలో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారికి ఎన్నారైలు ఆహారం సరఫరా చేస్తున్నారు.