హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు
కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థిసంఘం ఆరోనించింది. విద్యార్థిరంగం ఎదుర్కోంటున్న అనేక సమస్యలపై కేసీఆర్‌ ఇప్పటివరకు పరిష్కరించిన పాపాన పోలేదని జిల్లా నాయకులు అన్నారు. కేజీ టూ పిజి విద్య ప్రారంభించనే లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ 2800 హాస్టల్లున్నాయని, ఇందులో 10లక్షల మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారని వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా శ్రద్ద చూపించడం లేదన్నారు. ఇప్పటికి కూడా 30శాతం హాస్టళ్లకు భవనాలు లేవని, ఉన్నవాటిలో కూడా మరుగుదోడ్లు, బాత్రూమ్‌లు, ప్రహారీ గోడలు లేవన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లను  పరిశీలించిందన్నరు. అక్కడే పడుకుని వారితో ముచ్చటించడం జరిగిందన్నారు. దోమలు వాటిలో నాట్యం చేస్తున్నాయని, తద్వారా విద్యార్థులు రోగాల పాలవుతున్నారన్నారు. ఫ్యాన్‌ పనిచేస్తే కరెంట్‌ ఉండడం లేదని, రెండు ఉంటే కనీసం తలుపులు ఉండడంలేదన్నారు. విద్యార్థులు నానా తంటాలు పడుతున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఓవైపు విద్యారంగాన్ని కాపాడు తామంటునే కార్పోరేట్‌, ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారన్నారు. అలాగే విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల నిధులు
నేటికి కూడా  విడుదల చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వారంలో ఐదురోజులు గుడ్లు, రెండు రోజులు నాన్‌వెజ్‌ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం అమలులోపూర్తిగా విపలమైందన్నారు. సన్నబియ్యం ఇస్తున్నామని చంకలు గుద్దుకుంటున్న ప్రభుత్వం అందులో చెత్త ఎంతఉందో, ముక్కిన బియ్యం, పాలిస్డ్‌ బియ్యాన్ని మాత్రమే సరఫరాచేస్తున్న విషయాలను తాము స్వయం గా గుర్తించామని, తమతో వస్తే చూపించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.  ఈ సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో పోరాటాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.