హిండెన్‌ బర్గ్‌ విడుదల నివేదికపై జేపీసీ విచారణ

` విపక్ష నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన నివేదికపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. చిన్న రిటైల్‌ వ్యాపారుల సంపదకు భద్రత కల్పించే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్‌ రెగ్యులేటర్‌ అయిన సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిరదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆరోపణలు వెలుగుచూడటంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తోందా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికతో లక్షలాది మంది భారతీయుల పొదుపులు ప్రమాదంలో ఉన్నాయని.. ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఆరోపణలు వాస్తవమై? వ్యాపారులు కష్టపడి దాచుకున్న సంపద పోగొట్టుకుంటే ప్రధాన మంత్రా లేదా సెబీ చీఫ్‌ లేదా అదానీ ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. ఈ అంశంలో జెపిసి విచారణకు ప్రధాని ఎందుకు వెనకడుగు వేస్తున్నారో స్పష్టమౌతోందని అన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారు లకు భద్రత కల్పించాలంటే జెపిసి విచారణ తప్పనిసరి అని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. భారత రాజ్యాంగ విలువలను పక్కన పెట్టి తన మిత్రులను కాపాడుకునేందుకు ప్రధాని యత్నిస్తుంటారని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. తమ మిత్రులైన కార్పోరేట్ల అవినీతి విధానాలను రక్షించేందుకు, కేవలం కార్పోరేట్‌ ప్రయోజనాలను కాపాడేందుకు మాత్రమే బిజెపి పనిచేస్తోందని సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. జెపిసి విచారణ చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. జెపిసి విచారణ చేపట్టాల్సిందేనని సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.
హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో నష్టాల్లోకి అదానీ గ్రూప్‌ స్టాక్స్‌
అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజా ఆరోపణలు మరోసారి అదానీ గ్రూప్‌స్టాక్స్‌ను కుదిపేశాయి.ఈసారి అదానీ గ్రూప్‌ సంస్థలను నేరుగా లక్ష్యంగా చేసుకోనప్పటికీ.. గతంలో చేసిన ఆరోపణలకు కొనసాగింపుగా ఈసారి సెబీ చీఫ్‌ను ఈ వ్యవహారంలోకి లాగడం గమనార్హం. దీంతో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌పై మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ఆ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ ఈ ఉదయం బీఎస్‌ఈలో ఏకంగా 17 శాతం మేర నష్టపోయింది. అదానీ టోటల్‌ గ్యాస్‌ 13.39 శాతం, ఎన్డీటీవీ 11 శాతం, అదానీ పవర్‌ 10.94 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ గ్రీన్‌ ఎననర్జీ 6.96 శాతం, అదానీ విల్మర్‌ 6.49 శాతం, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 5.43 శాతం, అదానీ పోర్ట్స్‌ 4.95 శాతం, అంబుజా సిమెంట్స్‌ 2.53 శాతం, ఏసీసీ 2.42 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే, తర్వాత కాస్త కోలుకున్నాయి.గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలోని కొన్ని బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లలో సెబీ చీఫ్‌ మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లు 2015లో పెట్టుబడులు పెట్టారు. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. 2017లో సెబీ పూర్తికాలపు సభ్యురాలిగా మాధబి నియమితులయ్యారు. 2022 మార్చిలో సెబీ ఛైర్‌పర్సన్‌గా పదోన్నతి పొందారు. తమకు వాటాలున్న విదేశీ సంస్థలు కనుకే, అదానీ గ్రూప్‌పై సెబీ విచారణ తూతూమంత్రంగా జరిగేలా చేశారన్నది హిండెన్‌బర్గ్‌ తాజా ఆరోపణ. దీన్ని సెబీ చీఫ్‌తో పాటు అదానీ గ్రూప్‌ కూడా ఖండిరచింది.