హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు!
ఈటానగర్,ఫిబ్రవరి 7(జనంసాక్షి):అరుణాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక హిమపాతం వల్ల విధుల్లో ఉన్న ఏడుగురు సైనికులు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఎత్తయిన ప్రదేశం కమెంగ్ సెక్టార్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో హిమపాతం సంభవించిందని.. అందులోనే సైనికులు చిక్కుకుపోయారని అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భారీగా మంచుకురుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారని, వారికి సహయంగా నిపుణుల బృందాన్ని కూడా ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఘటనాస్థలికి తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.