హుజూరాబాద్‌లో భారీ చోరీ

దంపతులపై కత్తితో  దుండగులు దాడి

దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదుతో పరార్‌

హుజూరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దంపతులపై దాడి చేసి.. దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన ప్రతాపవాడలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లోని దంపతులపై కత్తితో దాడి చేసి సొమ్ముతో పరారయ్యారు. ఈ దాడిలో మహిళ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.