హెచ్‌సీయూలో ఉదృతమైన ఆందోళన
– రాజకీయ జోక్యంతోనే రోహిత్ మరణం
– సీతారాం ఎచూరి
– వీసీ వైఫల్యం వల్లే విద్యార్థి మృతి
– జగన్
హైదరాబాద్,జనవరి20(జనంసాక్షి):హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు బంద్ పాటిస్తూ తమ ఆందోళన చేస్తున్నారు.మరోవైపు పలువురు రాజకీయ పార్టీల నేతలు సందర్శించి విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సీతారం ఏచూరి, జగన్, తృణమూల్ ఎంపీలు బుధవారం వచ్చి విద్యార్థులను పరామర్శించారు. రాజకీయ పార్టీల జోక్యం వల్లే విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. రోహిత్ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సీతారం ఏచూరీ క్యాంపస్‌ను దర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ రాజీనామ చేయాలన్నారు. హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం సమగ్ర కమిటీని వేయాలని సీతారం ఏచూరి కోరారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన కలచివేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరక్ ఓబ్రయిన్ అన్నారు. బుధవారం ఉదయం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రతిమా మండల్, డెరక్ ఓబ్రయిన్ హెచ్‌సీయూను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఓబ్రయిన్ మాట్లాడుతూ…. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులు బాధాకరమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రోహిత్తో పాటు సస్పెన్షన్‌కు గురైన మరో నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. దేశంలో దళితులు బాగుపడటం బీజేపీ, ఆరెస్సెస్‌కు ఇష్టం లేదని ప్రొ. కంచె ఐలయ్య ఆరోపించారు. హెచ్సీయూ విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లో ఆయుధాలు ఏమైనా దొరికాయా ? అని నిలదీశారు. విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఓ కేంద్రమంత్రి ఎలా కేంద్రానికి లేఖ రాస్తారన్నారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్కు రాజకీయాలతో సంబంధం లేదని ఐలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో అగ్రకులాల ఆధిపత్యం నశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.విశ్వేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు.
నాలుగోరోజు కొనసాగుతున్న బంద్
పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాలుగోరోజు కూడా బంద్ కొనసాగుతోంది. సెంట్రల్ యూనివర్సిటీని అష్టదిగ్బంధం చేశామని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు బంద్ కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నేత ఈశ్వర్ తెలిపారు. పలువురు జాతీయ నేతలు సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ధర్నా చేస్తున్న విద్యార్థులకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రతిమా మండల్, డెరక్ ఓబ్రయిన్ సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వీసీ పి. అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రోహిత్ కులంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఈ సందర్భంగా రోహిత్‌కు గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి జేఏసీ విూడియాకు విడుదల చేసింది. రోహిత్ అంత్యక్రియలను హడావిడిగా జరపడం వెనుక కుట్ర దాగి ఉందని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది.
దత్తాత్రేయ ఇంటిముందు ఆందోళన
పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంగనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా రెండురోజులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భద్రతను పెంచారు.
సెంట్రల్ వర్శిటీ ఘటనపై ఆందోళనలు
సెంట్రల్‌వర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై దేశంలోనే కాదు పట్టణాలలో సైతం కేంద్రప్రభుత్వం మరియు వర్సిటీ అధికారుల పట్ల నిరసన జ్వాలలు వెళ్ళువెత్తుతున్నాయి.విద్యార్థి మృతిపై కరీంనగర్ జిల్లాలో రాస్తారోకోచేసి కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జిల్లాలో వరుసగా ఆందోళనలు మిన్నంటాయి. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దళిత విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాదాపు అరగంట వరకు రాస్తారోకో నిర్వహించడం జరిగింది.అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి,అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది.కేవలం కు వివక్షతోనే రోహిత్‌ను మిగతా నలుగు రిని సస్పెండ్ చేయడం జరిగినదని.దీనికి బాధ్యులైన అందరిపైనా అట్రాసిటీ కేసులు పెట్టాలని,లేనియెడల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించి వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని సంఘ నాయకులు తెలపడం జరిగింది.
తెలంగాణ బంద్‌కు పిలుపు
రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దళిత సంఘ నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రోహిత్ మృతికి ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపులే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురాం, నాయకులు శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.