హెచ్‌సీయూ విద్యార్థుల దీక్ష భగ్నం
– ఆస్పత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): స్కాలర్ రోహిత్ ఆత్మహత్యను నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో విద్యార్థులు చేస్తోన్న దీక్ష భగ్నమైంది. దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణంచడంతో వారిని పోలీసులు బలవంతగా ఆస్పత్రికి తరలించారు.కాగా, కేంద్ర మంత్రులు వీసీకి రాసిన లేఖల వల్లే వీసీ రోహిత్‌ను సస్పెండ్ చేశారని దీంతో రోహిత్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రోహిత్ మృతిపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే విద్యార్థులు చేపట్టిన దీక్షను పోలీసలు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వైద్యులు తెలపడంతో దీక్షను భగ్నం చేయడానికి పూనుకున్నారు. దీక్ష చేస్తున్న ఏడుగురిలో మైథిలి అనే మహిళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిచడంతో ఆమెను హెచ్ సీయూలోని హెల్త్ సెంటర్ కు తరలించారు. దీక్ష చేస్తున్న మిగిలిన విద్యార్థులను హెల్త్ సెంటర్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకుంటున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్ష విరమించేదిలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవులను నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సుశీల్ కుమార్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.