హెచ్‌సీీయూ ఘటనపై సభలో వాడీ వేడీ చర్చ

C

– కన్హయ్యను నేనే అరెస్టు చేయోద్దన్నాను

– వీసీ రీకాల్‌కు నేను ప్రధానితో మాట్లాడుతా

– పోలీసుల అత్యుత్సాహంపై విచారణ జరిపిస్తా

– తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆదివారానికి వాయిదా పడింది. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై సుదీర్ఘ చర్చ అనంతరం సభను ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సభను ఆదివారానికి వాయిదా వేశారు. అంతకు ముందు ఈఘటనలపై సభలో వాడీవేడీగా చర్చ సాగింది. దీనిపై సిఎం కెసిఆర్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ రెండు ఘటనలపై విచారణ జరగుతోందన్నారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై పలుమార్లు సభ వాయిదా పడింది. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ, ఓయు ఘటనలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు పదే పదే పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటం మంచిదికాదన్నారు. ¬ంశాఖ పద్దుపై చర్చ చేపట్టకుండా.. హెచ్‌సీయూ ఘటనపై వాయిదా తీర్మానంగానే చర్చించాలనడం సరికాదన్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర పోలీసులు సహకరించారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కన్హయ్యను అడ్డుకోవద్దు.. అరెస్టు చేయొద్దు అని తానే స్వయంగా డీజీపీతో పాటు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లకు ఆదేశించానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో తమ భావాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. ఆ క్రమంలోనే కన్హయ్యను అరెస్టు చేయలేదన్నారు. హెచ్‌సీయూ వద్ద కన్నయ్యను పోలీసులు అడ్డుకోలేదని స్పష్టం చేశారు.  పోలీసుల్లాగే, సెంట్రల్‌ వర్సిటీ భద్రతా సిబ్బంది కూడా ఖాకీ డ్రస్సులే వేసుకుంటారని చెప్పారు. యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతించినప్పటికీ వర్సిటీ సిబ్బంది కన్హయ్యను అడ్డుకున్నదని పేర్కొన్నారు. వర్సిటీలోకి బయటి వ్యక్తుల ప్రవేశం లేదని వీసీ అప్పారావు ఆదేశాల మేరకే కన్హయ్యను అడ్డుకుని ఉండొచ్చన్నారు. మరుసటి రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో కన్హయ్య తన భావాన్ని చెప్పారు.. అక్కడ కూడా పోలీసులు ఎలాంటి ఆటంకం కలిగించలేదని స్పష్టం చేశారు. రోహిత్‌ తల్లికి సంఘీభావం తెలిపేందుకు కన్హయ్యకుమార్‌ ఇక్కడికి వచ్చారని తెలిపారు. ప్రముఖుల పర్యటనల పట్ల విమర్శలు వస్తున్నందునే తాను హెచ్‌సీయూకు వెళ్లలేదని కేసీఆర్‌ చెప్పారు. హెచ్‌సీయూ వీసీని రీకాల్‌ చేసేది రాష్ట్రం పరిధిలోకి రాదని, అది కేంద్రం పరిధిలో ఉందని, అవసరమైతే తాను కేంద్రంతో, ప్రధాని మోదీతో మాట్లాడుతానని, రెండుమూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. ఇక ఈ అంశంపై సభలో తీర్మానం అవసరం లేదనుకుంటున్నానని కేసీఆర్‌ అన్నారు. ఓయూలో పోలీసులు అత్యుత్సాహం చూపితే చర్యలు తప్పవని ఆయన చెప్పారు. వివక్ష లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దీనిపై ¬ంమంత్రి నాయిని

నరసింహారెడ్డి  వివరణ ఇస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయం వెనుక సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు. ఓయూలో మృతి చెందిన వ్యక్తి విద్యార్థి కాదని చెప్పినా విద్యార్థులు వినలేదన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఓయూకు చేరుకుని మృతుడు విద్యార్థేనని వాదనకు దిగారని తెలిపారు. హెచ్‌సీయూలో అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. దళిత, మైనార్టీ విద్యార్థులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య అనంతరం రాహుల్‌గాంధీ రెండుసార్లు వచ్చారని, శాంతిభద్రతలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదన్నారు. యావత్‌ భారతదేశం నివ్వెరపోయినటువంటి ఘటన జరిగినా సీఎం ఎందుకు స్పందించలేదు, వీసీ అప్పారావును వెనుకేసుకు రావడానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. కేంద్రాన్ని వెనుకేసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రోహిత్‌ వేముల అంశంపై యావత్‌ భారతదేశం చర్చిస్తోందన్నారు. దళితుల గొంతును అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు.  రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై దిల్లీ నుంచి నాయకులు వచ్చి ఉద్రిక్తతలు పెంచేలా వ్యవహరించారని బిజెపి ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. తెలంగాణ శాసనసభలో హెచ్‌సీయూ, ఓయూలో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో జరిగిన ఘటనపై దేశవ్యాప్త చర్చ జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, తానే లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కార్చే చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును కేంద్ర ప్రభుత్వం తక్షణమే రీకాల్‌ చేయాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. శనివారం తెలంగాణ శాసనసభలో చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే వర్సిటీకి అప్పారావును పంపిందని ఆరోపించారు. వీసీ రాకతోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయని, అందువల్ల తక్షణమే ఆయనను రీకాల్‌చేసి హెచ్‌సీయూలో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. ఇటీవలి విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని ఆయన తీవ్రంగా ఖండించారు. వర్సిటీలో అశాంతికి కారణమైన వ్యక్తిని తక్షణమే వెనక్కి పంపేందుకు సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకొని కేంద్రానికి లేఖరాయాలని కోరారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. వీసీ అప్పారావును బాధ్యతలనుంచి తప్పించి వర్సిటీలో శాంతియుత వాతావరణానికి కృషిచేయాలన్నారు. వీసీ చర్యల వల్లే రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు ఎత్తడమే తప్పు అన్నట్లుగా పోలీసుల ధోరణి ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హెచ్‌సీయలో వివక్ష కొనసాగుతోందని రోహిత్‌ వేముల వీసీకి లేఖరాశారన్నారు. సామాజిక బహిష్కరణకు గురిచేసి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారన్నారు. రోహిత్‌ మరణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేశాయని ఆరోపించారు. విద్యాసంస్థల్లో వివక్ష రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పౌరహక్కులు పొందుతున్న వారందరూ అంబేడ్కర్‌ వాదులేనన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ పర్యటన రాజకీయం కాదని స్పష్టంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు హెచ్‌సీయూకు రావొద్దని రాహుల్‌ తమకు సూచించారని ఈ సందర్భంగా ఆయన సభలో తెలిపారు. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓ దశలో కాంగ్రెస్‌ సభ్యురాలు గీతారెడ్డి ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. అనంతరం డప్యూటి స్పీకర్‌ సభను ఆదివారానికి వాయిదా వేశారు.

చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు విచారకరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ శాసనసభలో సీఎం మాట్లాడుతూ..హెచ్‌సీయూ, ఓయూ ఘటనలు దురదృష్టకరం.. అందరం ఖండించదగినవేన్నారు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కారుపై జరిగిన దాడిని సీఎం ఖండించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల తీవ్రస్థాయి ఆందోళనలకు, నిరసనలకు కారణమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఘటనపై చర్చకు సభలో పట్టుపట్టగా ముఖ్యమంత్రి స్పందించారు. వేముల రోహిత్‌ ఆత్మహత్య గురించి ప్రస్తావిస్తూ హెచ్‌సీయూలో ఒక విద్యార్థి చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై వాయిదా తీర్మానం కింద అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టడంతో కేసీఆర్‌ ప్రతిస్పందించారు. హెచ్‌సీయూలో, ఓయూలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, అవి జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ ఘటనలను అందరూ ఖండించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కారుపై దాడి జరగడం విచారకరమని అన్నారు.  డిమాండ్ల పద్దు, ¬ం శాఖపై చర్చ జరగనుందని, కాబట్టి ¬ంశాఖపై చర్చలో భాగంగా హెచ్‌సీయూ, ఓయూ ఘటనలను కూడా చర్చిద్దామని ఆయన కాంగ్రెస్‌ సభ్యులకు సూచించారు. గంట సమయం ఎక్కువ తీసుకొని అయినా అన్ని అంశాలను సాకల్యంగా చర్చిద్దామని, ఇందుకు సభ్యులు సహకరించాలని సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలను కోరారు. హెచ్‌సీయూ అంశంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుండటంతో వారిని విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు ఘటనలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హెచ్‌సీయూ, ఓయూలో నెలకొన్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చాయి. వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కోరుతూ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. హెచ్‌సీయూ ఘటనపై చర్చ అంశంలో ప్రభుత్వానికి

ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటం సభ్యులకు మంచిది కాదన్నారు.

యూనివర్శిటీల్లో ఘటనలపై పట్టుపట్టిన కాంగ్రెస్‌

ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ ప్రారంభించే సమయంలో ప్రశ్నోత్తరాలను చేపట్టాలని యత్నించిన స్పీకర్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి నిర్ణయాన్ని ప్రతిపక్షం అడ్డు తగిలింది, దేశాన్ని, రాష్టాన్న్రి  కుదిపేసిన హెచ్‌సీయు, ఓయూ ఘటనపై ఖచ్చితంగా చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ కు చెందిన సంపత్‌ కుమార్‌, గీతారెడ్డి తదితరలు పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా స్పీకర్‌ వెల్‌లోకి దూసుకువచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అయితే డిప్యూటీ స్పీకర్‌ వారిని సముదాయించేందుకు అనేక సందర్భాల్లో ప్రయత్నించినా వినలేదు, ఈక్రమంలో శాసనసభా వ్యవహారల మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా  వెల్‌లోకి ఎవ్వరు కూడా వెల్లవద్దని నిర్ణయించామని, అయితే దీనిని ఈరోజు తుంగలో తొక్కడం భావ్యం కాదన్నారు. కేవలం చర్చ చేయడం కాక రచ్చ చేసేందుకు సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సభ్యులను సీట్లలోకి పంపించేందుకు జానారెడ్డి జోక్యం తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే జానారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంగా దేశంను కుదిపేస్తున్న దళిత విద్యార్థుల అణిచివేత సంఘటనపైన, అనవసర లాఠీ చార్జిపైన చర్చించాలని పట్టు బట్టడం తప్పెలా అవుతుందన్నారు. ఇంతకాలం ప్రభుత్వానికి సహకరించామా లేదా అనేది మంత్రి అర్థం చేసుకోవాలన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తే సహకరిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్కటైనా అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ను ప్రభుత్వవ స్వీకరించిందా అని నిలదీశారు. అయితే మంత్రి హరీష్‌ రావు జోక్యం చేసుకుని మాట్లాడుతూ ఈరోజు చర్చలో ¬ంశాఖ పద్దులపై చర్చించే అంశం ఉన్నందున విూరే (కాంగ్రెస్‌) ముందు అవకాశంతీసుకుని ఏమి మాట్లాడతారో మాట్లాడాలన్నారు. అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌కు అవకాశం లేకున్నా ¬ంశాఖ పద్దులో ఏదైనా మాట్లాడొచ్చని దీనిని గమనించి సహకరించాలన్నారు. పదే పదే ఇదే రీతిన సలహాలివ్వడంతో కాంగ్రెస్‌ సభ్యులు వారి వారి స్థానలకు వెల్లారు. ఇంతలో ఎంఐఎంకు చెందిన అక్బర్‌ఉద్దీన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్నా చర్చించకపోతే సభ ఎందుకన్నారు. ప్రతి రోజు అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌లు వాయిదా వేస్తూ పోవడం అధికార పక్షానికి అలావాటైపోయిందన్నారు.  మరోసారి మంత్రి కలుగచేసుకుంటూ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా  ఉందన్నరు. అయితే దీనిపై ఎలా చర్చించాలనే అంశంపై నిర్ణయించేందుకు ఫ్లోర్‌ లీడర్లను చాంబర్‌కు పిలవాలని మంత్రి డిప్యూటీ స్పీకర్‌కు సలహా ఇచ్చారు. ఇంతలో మరోసారి జీవన్‌రెడ్డి రోహిత్‌, జెఎన్‌యు ఘటన ,ఓయు లాఠీచార్జీలపై చర్చించాల్సిందేనని పట్టు బడుతూ వెల్‌లోకి దూసుకు వచ్చారు. ఈక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ సభను పదినిమిషాలు వాయిదావేశారు.