హెచ్1బీ తాత్కలిక వీసారద్దు తప్పే..
– నిషేధాన్ని అడ్డుకున్న అమెరికా జడ్జి
వాషింగ్టన్,అక్టోబరు 2(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఆయన తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా నిషేధాన్ని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. ట్రంప్ తన రాజ్యాంగ అధికారాలను అతిక్రమించారని ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ ఆరోపించారు. హెచ్-1బీ వీసా నిషేధాన్ని తప్పుపడుతూ గురువారం ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్, టెక్‌నెట్ సంయుక్తంగా హెచ్-1బీతోపాటు పలు వీసాల నిషేధంపై కోర్టును ఆశ్రయించాయి. అమెరికా వాణిజ్య, ¬ంశాఖలకు వ్యతిరేకంగా దావా వేశాయి. హెచ్-1బీతో పాటు పలు వీసాలను వెంటనే నిలిపివేయడం వల్ల తయారీ సంస్థలకు క్లిష్టంగా మారిందని, ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి, ఆవిష్కరణపరంగా ఉద్యోగులను భర్తీ చేయడం కష్టంగా ఉన్నదని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ఆ పిటిషన్‌లో ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్, హెచ్-1బీతోపాటు ఇతర వీసాల నిషేధాన్ని తప్పుపట్టారు. ట్రంప్ తన రాజ్యాంగ అధికారాలను అతిక్రమించారని వ్యాఖ్యానించారు. వీసాల నిషేధంపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే రాజ్యాంగం కల్పించిందని, అధ్యక్షుడికి కాదంటూ 25 పేజీల తీర్పులో పేర్కొన్నారు.హెచ్-1బీ, హెచ్-2బీ, ఇతర విదేశీ వీసాలైన జే, ఎల్ వీసాలపై ఈ ఏడాది చివరి వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ జూన్ నెలలో ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఐటీ కంపెనీలు, అమెరికా సంస్థలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తాయి.