హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌదీయువరాజు మృతి

మరో ఏడురుగు అధికారులు కూడా దుర్మరణం

రియాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): హెలికాప్టర్‌ ప్రమాదంలో సౌదీ అరేబియా యువరాజు మన్సూర్‌ బిన్‌ ముక్రిన్‌ మృతి చెందారు. యెమెన్‌ సరిహద్దు ప్రాంతంలో ఏడుగురు అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మన్సూర్‌ బిన్‌తో పాటు మిగతా ఏడుగురు అధికారులు మృతి చెందారు. మన్సూర్‌ రియాద్‌లోని అసిర్‌ ప్రావిన్స్‌కు డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మహారాజుగా బాధ్యతలు చేపట్టిన ముక్రిన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ కుమారుడు మన్సూర్‌. హెలికాప్టర్‌ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సౌదీ అరేబియాకి చెందిన 11 మంది యువరాజులను ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. అరెస్టయిన వారిలో నలుగురు మంత్రులు, మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అవినీతి ఆరోపణలపై వీరిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.