హెల్మెట్‌ తప్పనిసరిపై హైకోర్టు నిలుపుదల

2

ముందు ప్రజల్ని చైతన్యవంతం చేయండి

హైదరాబాద్‌,సెప్టెంబరు7(జనంసాక్షి): ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు చేయాలన్న తెలంగాణ రవాణాశాఖ నిబంధనపై హైకోర్టు తప్పు పట్టింది. ఇంతకాలం హెల్మెట్‌ నిబంధలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. నిబంధనలను తప్పని సరిచేస్తూ జారీచేసిన ఉత్తర్వులపై  వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం…ద్విచక్రవాహనంతో పాటు హెల్మెట్‌ కొనుగోలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. హెల్మెట్‌ వాడకం జరిగేలా ప్రజలను చైతన్యం చేయాలని  న్యాయస్థానం సూచించింది. ముందుగా ప్రజలను చైతన్యం చేసిన తరవాతనే నిబంధన విధించాలంది. అయితే ఇప్పటి వరకు హెల్మెట్‌లేని వాహనదారులపై 92,164 కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 92,164 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులకు 15 రోజులపాటు హెల్మెట్‌ వినియోగంపై చైతన్యం కల్పించాలని, ఆ తర్వాత హెల్మెట్‌ వాడకాన్ని తప్పనిసరి చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలపాటు వాయిదా వేసింది. ఇప్పటికిప్పుడు మోటారు వాహనదారులు హెల్మెట్‌ లు వాడాలంటూ తెలంగాణ రవాణా శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పదిహేను రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ నిబంధనను అమలు చేయాలని హైకోర్టు సూచించింది. అలాగే రిజిస్టేన్ర్‌ సమయంలో హెల్మెట్‌ కొనుగోలు చేయాలన్న నిబంధనను కూడా హైకోర్టు తప్పుపట్టింది. ముందుగా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆ తర్వాత రవాణాశాఖ సర్కులర్‌ పై విచారణ చేసి నిర్ణయం చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా రవాణాశాఖ వారు హెల్మెట్‌ కంపెనీలతో కుమ్మక్కు అయిన చందంగా అంతర్గత సర్కులర్‌ జారి చేసినట్లుగా ఉందని పిర్యాదుదారుడు ఆరోపించారు. గత ఏడాది కాలంలో తొంభై రెండు వేల కేసులు పెట్టామని రవాణా శాఖ అదికారులు తెలియచేశారు. కేసులతో ఏమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.