హైకోర్టును విభజించండి

2

– పార్లమెంట్‌ ఆవరణలో తెరాస ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ,జులై22(జనంసాక్షి):

హైకోర్టు విభజనపై టిఆర్‌ఎస్‌ ఎంపీలు గళమెత్తారు. పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు విభజన కాకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడాది అయినా కూడా హైకోర్టు విభజన జరగకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని హైకోర్టు విభజన జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్‌ ఎంపిలు పార్లమెంటులో ఆందోళన కు దిగారు. తాము దీనిపై స్పష్టత వచ్చే వరకు పార్లమెంటును అడ్డుకుంటామని టిఆర్‌ఎస్‌ ఎంపిలు హెచ్చరించారు.ఉమ్మడి రాష్ట్ర హై కోర్టు విభజనను అడ్డుకుంటున్నది కొందరు కేంద్ర మంత్రులేనని తాము నమ్ముతున్నామని లోక్‌ సభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత జితేందర్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎమ్‌.పి కవిత ఆరోపించారు. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని తెలంగాణ ప్రజల పక్షాన నిలవాలని వారు కోరారు.గత కొంతకాలంగా హైకోర్టు విభజన అంశాన్ని టిఆర్‌ఎస్‌ సీరియస్‌ గా తీసుకుని పోరాటం చేస్తున్నది. గత సారి పార్లమెంటు సమావేశాలో కూడా ఆందోళనకు దిగిన వీరు ఈ సారి కూడా అదే బాట పట్టారు.