హైకోర్టు తీర్పుతో అందరిలోనూ ఆనందం

అమరావతి కోసం ముందుకు సాగాలి
ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవద్దు : టిడిపి
అమరావతి,మార్చి4(జనం సాక్షి): రాజధానిపై హైకోర్టు తీర్పుతో 5 కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకుంటు న్నారని, ఒకే రాజధాని అమరావతి అన్‌ఇ ప్రజలు నినదిస్తున్నారని టిడిపి నేతలు అన్నారు. దీనిని గమనించి సిఎం జగన్‌ వెంటనే అమరావతికి అడుగు వేయాలన్నారు. ఈ సందర్బంగా మాజీమంత్రి నక్కా ఆనంద్‌ బాబు తదితరులుమాట్లాడుతూ జగన్‌ మొడిపట్టుద వీడాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికే కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఒకే ఒక కారణంతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని తెలిపారు. వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రికి చట్టాలు అంటే గౌరవం లేదన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని అన్నారు. అమరావతి ఉద్యమం పాఠ్య పుస్తకాల్లో లిఖించదగ్గ ఉద్యమమని చెప్పారు. పనికిమాలిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని నక్కా ఆనందబాబు విమర్శలు గుప్పించారు. హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన తప్పులు గ్రహించి మొండిపట్టు వీడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ… దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతల ఆమోదంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే రైతులు నమ్మి భూమిలివ్వటం తప్పా అని ప్రశ్నించారు. చట్టాలు, నిబంధనలకంటే సహజ న్యాయానికి విరుద్ధంగా అమరావతిని తరలించాలనుకోవటం తప్పే అని అన్నారు. సహజ న్యాయం చెల్లుబాటు కోసం భూములిచ్చిన రైతులు 800 రోజులకు పైగా పోరాడాలా అని నిలదీశారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం ఇకనైనా తీరు మార్చుకోకుంటే భగవంతుడు కూడా క్షమించడన్నారు. సుప్రీంకోర్టుకు పోతేపొండి కానీ రాష్టాన్న్రి అధోగతి పాలు చేయొద్దు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేపట్టిన అమరావతి యాగానికి.. న్యాయదేవత ఊపిరిపోసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. అమరావతికి మరణం లేదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం 189 మంది రైతులను పొట్టనబెట్టుకుందని విమర్శించారు. జగన్‌ను నమ్మి ఒక్కరైనా సెంటు భూమి లేదా రూపాయి ఇస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనురాధ అన్నారు. అమరావతి రైతుల కష్టాన్ని, త్యాగాన్ని వైసీపీ పాలకులు గుర్తించకపోయినా.. ఆ దేవుడు గుర్తించాడని… అందుకే హైకోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయమని తెలిపారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వైసీపీ నేతలు భేషజాలకు పోకుండా ఇకనైనా మూడు రాజధానులు విషయం మర్చిపోయి.. అమరావతి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే రాష్టాన్రికి దేశానికి మంచిదని దేవతోటి నాగరాజు హితవుపలికారు.