హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి

టిడిపి నేతలు ధూళిపాళ్ల, ప్రత్తిపాటిల డిమాండ్‌
గుంటూరు,మార్చి3(జనం సాక్షి): మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటీషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత ధూళి పాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ, అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలన్నారు. రాజధాని రైతులపై కక్షపూరిత చర్యలను ఆపాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలను పూర్తిచేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్‌ చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సీఆర్డీఓ చట్టం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల త్యాగాలను గుర్తించి సీఎం జగన్‌ రెడ్డి మనస్సు మార్చుకోవాలని హితవుపలికారు. మరోసారి మూడు రాజధానులు అనే ప్రస్తావన రాకుండా చేసిన తప్పును సరి దిద్దుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఏకైక రాజధాని అమరావతి గా ప్రకటన చేయాలని పుల్లారావు డిమాండ్‌ చేశారు.