హైకోర్టు విభజనపై కేంద్రం నిర్లక్ష్యం
– గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీల బృందం
– పార్లమెంట్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక
హైదరాబాద్,జులై16(జనంసాక్షి):
హైకోర్టు విషయంలో ఇంకా ఆలస్యం చేయడం తగదని, ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో కేంద్రం విఫలమయ్యిందని టిఆర్‌ఎస్ ఎంపిలు ఆరోపించారు. ఏడాది గడిచినా హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంలో హావిూని నిలబెట్టుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ను వెంటనే విభజించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. దీనిపై వారు ఒక వినతిపత్రం ఇస్తూ ఎపి ప్రభుత్వం ఇందుకు అంగీకరించేలా చొరవ తీసుకోవాలని గవర్నర్ ను కోరారు.ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రస్తావిస్తానని గవర్నర్ హావిూ ఇచ్చారు. ఆ తర్వాత ఎంపిలు కేశవరావు,జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ లు విూడియాతో మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతి రాష్ట్రానికి హైకోర్టు అవసరం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం గడిచి పోయినా హైకోర్టు విభజన జరగడం లేదని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ఎంపిలతో కలసి ఆయన గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సమస్యలు పరిష్కరించడం గవర్నర్ బాధ్యత. అందుకే గవర్నర్‌ను కలిశామని తెలిపారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. హైకోర్టు విభజన ఇప్పటికే ఆలస్యమయిందన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. హైకోర్టును తక్షణమే విభజించాలని పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పునర్విభజన చట్టంలో హైకోర్టు విభజించాలని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు కావాలనే ఆలస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో హైకోర్టు అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిగా ఏర్పాటు కావాల్సింది హైకోర్టు అని చెప్పారు. దేశంలో నూతనంగా ఏర్పడ్డ ప్రతీ రాష్ట్రానికి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ విషయంలో అలా జరగడం లేదన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ లోక్‌సభ సాక్షిగా హావిూ ఇచ్చినా అమలు కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా హైకోర్టు విభజన జరగకపోవడం బాధాకరమని మరో ఎంపీ వినోద్ పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాల్లోని సమస్యలను గాలికి వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఏపీ సీఎంకు లేఖ రాసినా స్పందన కరువైందన్నారు. హైకోర్టు విభజనపై చంద్రబాబును వివరణ కోరుతానని గవర్నర్ హావిూ ఇచ్చారని తెలిపారు. స్పష్టమైన హావిూ కోసం ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన హావిూ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. .తాము దీనిపై మళ్లీ పార్లమెంటులో పోరాడతామని ప్రకటించారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఎంపిలు కవిత, బూర నరసయ్య గౌడ్, సీతారాం నాయక్ లు కూడా గవర్నర్ ను కలిసిన బృందంలో ఉన్నారు.