హైదరాబాద్‌కు జలగండం
– కుండపోత వర్షం
– నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
– అత్యవసరమైతేనే బయటికి రండి
– జీహెచ్‌ఎంసీ కమిషనర్
– హుస్సేన్‌సాగర్ గేట్లు ఎత్తివేత
– ఏడుగురు మృతి
హైదరాబాద్,ఆగస్టు 31(జనంసాక్షి): భారీ వర్షం భాగ్యనగర జీవితాన్ని చిగురుటాకులా వణికించేలా చేసింది. బుధవారం ఉదయం కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో గోడలు కూలిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారని సమాచారం. రామంతాపూర్‌లో నలుగురు, ముషీరాబాద్‌లో ముగ్గురు మరణించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి. హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా భాగ్యనగరంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్ష బీభత్సానికి పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో మరో రెండుగంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. అత్యవసరమైతే తప్ప.. బయటికి వెళ్లవద్దని నగర వాసులుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యాన్¬ల్‌లు తెరవద్దని జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని డిప్యూటీ కమిషనర్లు, ఏంఎంహెచ్‌వో లను ఆదేశించారు. మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు సాయమందించేందుకు హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-21111 111, లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యాన్¬ల్‌లు తెరవొద్దని సిబ్బందిని ఆదేశించారు. మియాపూర్, కూకట్‌పల్లి, ఎస్.ఆర్.నగర్, బోరబండ, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, అవిూర్‌పేట, పంజాగుట్ట, అబిడ్స్, నాంపల్లి, బషీరాబాగ్, మారేడుపల్లి, బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్, పార్శిగూడ, చిలకలగూడ, అడ్గగుట్ట, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రామంతాపూర్‌లోని ఇందిరా ఇంపీరియర్ కాంప్లెక్సు ప్రహరీగోడ కూలి ముగ్గరు మృతి చెందారు. మరొకరికి గాయలయ్యాయి. ముషీరాబాద్ బోలక్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి పాత ఇల్ల కూలి ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మహిళ, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని సవిూపంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిల్‌కుష్(26), మారియా(3), జేబా ఫాతిమా(2) మృతిచెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
నగరంలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులపై అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. వర్షాలకుజనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులతో సచివాలయంలో సమావేశమై పరిస్థితిని సవిూక్షించారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి విూడియాతో మాట్లాడుతూ… భారీ వర్షాల కారణంగా అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ 20 మి.విూ వర్షపాతం తట్టుకోగలదు, హైదరాబాద్‌లో 60 మిల్లీ విూటర్ల వర్షం కురిసిందని తెలిపారు. గంట వ్యవధిలో అంబర్ పేటలో 118 మి.విూ వర్షం కురిసిందని వెల్లడించారు. నగరంలో నిలిచిన వరద తగ్గడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని తెలిపారు. మరోవైపు వర్షాలతో జంటనగరాల్లో ఏర్పడిన పరిస్థితులపై మంత్రి జగదీష్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు లేదా స్తంభాలు కూలి ప్రమాదాలు జరుగకుండా, షార్ట్ సర్య్యూట్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలను విద్యుత్ సిబ్బంది తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. హైదరాబాద్ భారీ వర్షాలకు వేర్వేరు చోట్ల ఏడుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష పరిహారాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ అధికారులతో వర్షాలపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. కంట్రోల్ రూమ్‌కు చాలా ఫిర్యాదు వస్తున్నాయి. ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత, శిథిలావస్థ భవనాల్లోని ప్రజలు ముందస్తుగా ఖాళీ చేయాలన్నారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాభవనాల్లో ఉంటే ఖాళీ చేయాలన్నారు. అలాంటి వాటి వివరాలను అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే విూడియాకూడా ఇందుకు తోడ్పడాలని అన్నారు. నగరంలో మరింత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. నగరంలో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ సూచించారు. ప్రజలు నగరంలోకి ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. సాయంత్రం వేళ భారీగా ట్రాఫిక్ స్తంభించే అవకాశముందని తెలిపారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ 70 మి.విూ టర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది.
స్తంభించిన ట్రాఫిక్
భారీ వర్షంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం కార్యాలయాలకే వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు,
కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. మియాపూర్ నుంచి అవిూర్‌పేట వచ్చేందుకు దాదాపు రెండుగంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోఠి నుంచి మలక్‌పేట యశోద ఆసుపత్రి వరకు ట్రాఫిక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాదచారులు కూడా వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు మెట్రో పనులతో సతమతవుతున్న నగర వాసులకు భారీ వర్షంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయయమయ్యాయి. రహదారులు తటాకంలా మారడంతో వాహన చోదకులు నరకయాతన అనుభవించారు. వరద నీటితో జలమయమైన రహదారులపై ముందుకెళ్లలేక .. వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడ్డారు.ఉప్పల్‌లో భారీ వర్షానికి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మొట్రో స్టేషన్, జెన్‌ట్యాక్ వద్ద వరదనీరు నిలిచిపోయింది. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైటెక్ సిటీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్, ఆజంపూర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జలమయమైన రోడ్లపై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మలక్‌పేట ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నల్గొండ చౌరస్తా, ఐఎస్ సదన్, చంచల్‌గూడ ప్రాంతాల్లో వరదనీరు నిలిచిపోయింది. మాదన్నపేట కూరగాయాల మార్కెట్‌లో భారీగా వరద నీరు చేరడంతో కూరగాయలు అమ్మకాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి చాదర్ ఘాట్, మలక్‌పేట వంతెన, ఆజంపురాలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైల్వే వంతెన కింద భారీగా నీరు చేరి చెరువును తలపించే విధంగా ఉంది. ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఉప్పరపల్లి వద్ద తటాకాన్ని తలపించేలా నీరు నిలిచిపోయింది. సవిూపంలోని బస్తీలు జలమయమయ్యాయి. ఇళ్లల్లో వరద నీరు చేరి, బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో రెండు అడుగుల మేర వర్షం నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పలు ఎంఎంటిసి రైళ్లు రద్దు
వర్షం కారణంగా నగరంలో తిరిగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. బుధవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురియడంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే… వర్షం కారణంగా ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచి పోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా… నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసిన అధికారులు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రైళ్లను పునరుద్దరించనున్నారు. అలాగే…. టీఆర్‌ఎస్ భవన్ సవిూపంలో రోడ్డుపై ఓ బస్సు నిలిచిపోయింది. దీంతో జూబ్లీహిల్స్‌చెక్‌పోస్టు నుంచి పెన్షన్ ఆఫీస్ వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది. అలాగే సోమాజీగూడ ఆస్కీ దగ్గర ఓ చెట్టు కూలి రోడ్డుపై పడడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జాం అయింది.
రామంతాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన 4గురు మృత్యువాత
నగరంలో బుధవారం ఎడతెరపిలేకుండా కురిసిన వర్షం ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రామాంతపూర్ ప్రగతి నగర్‌లో భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.మృతులు బాలస్వామి, చిన్నమ్మ, శ్రీకర్, పార్వతిగా గుర్తించారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని గోడ శకలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. మరోవైపు భారీ వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, స్పెషల్ టీంలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో కొద్ది సమయంలోనే భారీ వర్షం కురవడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్ స్తంభించింది. బస్తీలలోకి వరద నీరు చేరడంతో వాటిని తొలిగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు, వాటర్ బోర్డు అధికారులు యత్నిస్తున్నారు. దాదాపు మూడుగంటలపాటు భారీ వర్షం కురిసింది.
నిండుకుండలా హుస్సేన్ సాగర్
దాదాపు 15 ఏళ్ల తరవాత హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తడంతో భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. దీంతో గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నగరం చుట్టుపక్కల కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హుస్సేన్‌సాగర్ తూములను తెరిచి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. నీటి విడుదల సందర్బంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పలువురు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈమేరకు హుస్సేన్‌సాగర్ నాలాలకు సవిూపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. కాగా, హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని సగానికి తగ్గించనున్నారు. మళ్లీ వర్షాం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో జలాశయంలో నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. 2000 వ సంవత్సరంలో అప్పట్లో భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండింది. ఇప్పుడుకూడా అదే పరిస్థితి ఏర్పడింది. చాలాకాలం తరవాత మళ్లీ ఇప్పుడు భారీ వర్షం కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదిలారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.




