హైదరాబాద్‌లో బట్టబయలైన మరో డ్రగ్స్ బాగోతం!
– బొల్లారం వద్ద 179 కిలోల ఎపిడ్రిన్ గుర్తింపు
– ఇద్దరి ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
హైదరాబాద్, నవంబర్16(జనంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది… భారీగా మొత్తంలో డ్రగ్స్ ను గురువారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారం లో ఉన్న ఓ రసాయన పరిశ్రమ లో అక్రమంగా తయారు చేస్తున్న 179 కిలోల మత్తుమందు ను నార్కోటిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో సదరు కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎఫ్రిడిన్ మారకద్రవ్యం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఐదు కోట్లు పైబడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఓ మారక ద్రవ్యం తయారీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బొల్లారం లోని ఓ ప్రైవేట్ పరిశ్రమను లీజుకు తీసుకుని అందులో ఈ మందును తయారుచేస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ డ్రగ్స్ వెలుగుచూడటం గమనార్హం. ఎలాంటి పేరు లేని ఈ
పరిశ్రమలోని రియాక్టర్‌ను 15 రోజుల పాటు రూ. 2 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్న వ్యక్తులు, ఎపిడ్రిన్‌ను తయారు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎపిడ్రిన్‌తోపాటు మెటామిథామైన్‌ను కూడా వీరు తయారు చేసినట్లుని అధికారుల తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం వేడుకలు లక్ష్యంగా ఈ దందా మొదలు పెట్టినట్టు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో బయటపడ్డ డ్రగ్స్ దందా చలనచిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపి, తెలుగు రాష్టాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. టాలీవుడ్‌కు చెందిన పూరీ జగన్నాథ్, రవితేజ, నవదీప్, చార్మీ, సుబ్బరాజు, తరుణ్ లాంటి వారందరూ ఈ కేసులో నోటీసులు అందుకుని పోలీసు విచారణకు హాజరయ్యారు. సుమారు నెల రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారం పూర్తిగా మరచిపోకముందే తాజాగా సంగారెడ్డి ప్రాంతంలో భారీగా డ్రగ్స్ ను గుర్తించడం గమనార్హం. ఓ వైపు డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో అంతమొందించే దిశలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండంతో పలు ప్రాంతాల్లో అడపాడదపా భారీ సంఖ్యలో డ్రగ్స్ దొరుకుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ప్రస్తుతం గుర్తించిన డ్రగ్స్ వెనుక ప్రధాన వ్యక్తులు ఎవరెవరె ఉన్నారా అనే విషయాలపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు.