హైదరాబాద్‌లో భారీ గాలి,వాన భీభ‌త్సం

హైదరాబాద్‌లో భారీ వర్షం
-గాలిదుమారంతో నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు
– గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షం
– ఇక్కట్లు పడ్డ వాహనదారులు
హైదరాబాద్‌, మే17(జ‌నం సాక్షి ) : సాయంత్రం నాలుగు గంటలు.. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే ¬రున ఈదురు గాలులతో వర్షం బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కొమ్ముకొనికొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో భారీ వర్షం దంచేసింది.
దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అవిూర్‌పేట, కూకట్‌పల్లితో పాటు రాంనగర్‌, ఓయూ, సికింద్రాబాద్‌ పలు ప్రాంతాల్లో భీకరగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న మూడురోజుల్లో గ్రేటర్‌ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.