హైదరాబాద్‌లో భారీ గూగుల్‌ క్యాంపస్‌

3

– రూ.1000 కోట్లతో నిర్మాణం

– మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ ఒప్పందం

హైదరాబాద్‌ ,మే12(జనంసాక్షి):  మంత్రి కెటిఆర్‌ అమెరికా పర్యటనతో పెట్టుబడులకు రాదారి ఏర్పడుతోంది. ప్రతిష్టాత్మక గూగుల్‌ సంస్థ హైదారబాద్‌లో తన సంస్థను వెయ్యి కోట్లతో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్‌ సమక్షంలో ఒప్పందం చేసుకుంది.  రానున్న నాలుగేళ్లలో హైదరాబాద్లో వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజం గూగుల్‌ సంస్థ అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మంగళవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి, గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ రాడ్‌క్లిఫ్‌… మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో  ప్రస్తుతం ఉన్న గూగుల్‌ సిబ్బందిని 6500 నుంచి 13 వేలకు పెంచనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారన్నారు. అలాగే హైదరాబాద్లో గూగుల్‌ సంస్థ భారీ క్యాంపస్‌ను  ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఇది ఆసియాలోని అతిపెద్ద క్యాంపస్‌ అవుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 5వ తేదీన అమెరికా వెళ్లారు. అందులోభాగంగా అమెరికాలోని పలు కంపెనీలు, సంస్థల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌  సమావేశ

మవుతున్నారు. అందులోభాగంగా కేటీఆర్‌ గూగుల్‌ సంస్థ ప్రతినిధులతో భేటీ ఆయ్యారు. ఈ నెల 16న కేటీఆర్‌ హైదరాబాద్‌కు  తిరుగు ప్రయాణమవుతారు. ఈ ఒప్పందం మేరకు  గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈమేరకు గూగుల్‌ సంస్థకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ కాలిఫోర్నియాలో ఉన్న మౌంట్‌ వ్యూలో నెలకొల్పబడిన గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్‌ సంస్థ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ రాడ్‌క్లిఫ్‌, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కాగా, గూగుల్‌ సంస్థ అమెరికా అవతల నిర్మిస్తోన్న మొట్టమొదటి గూగుల్‌ క్యాంపస్‌. ఈ ఒప్పందం ప్రకారం నగరంలోని గచ్చిబౌలిలో గూగుల్‌ సంస్థ 7.2 ఎకరాల్లో, రూ.1000 కోట్ల వ్యయంతో గూగుల్‌ క్యాంపస్‌ను నిర్మించనుంది. 2016 వేసవికి ముందే ఈ క్యాంపస్‌ నిర్మాణ పనులను చేపట్టునున్నట్టు గూగుల్‌ ఉపాధ్యక్షుడు డేవిడ్‌ ర్యాడ్‌క్లిఫ్‌ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఈ నిర్మాణం పూర్తి కాగలదని భావిస్తున్నారు. 2019 వేసవి కాలానికి  ముందే గూగుల్‌ క్యాంపస్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు. గూగుల్‌ సంస్థ ఆసియా ఖండంలోనే మొదటిసారిగా తన తొలి ప్రాంగాణాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నగరంలో గూగుల్‌ సంస్థలో ఏడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తోన్నారు. ఈ క్యాంపస్‌ పూర్తయితే ఈ సంఖ్య రెట్టింపై 13 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ సంస్థలో 55 వేల మంది పనిచేస్తోన్నారు.