హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

3

– సీమాంధ్రులకు సమస్యలు లేవు

– థాంక్స్‌ టూ సీఎం కేసీఆర్‌

– సి.రామచంద్రయ్య

హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి):

థాంక్స్‌ టూ తెలంగాణ సిఎం కెసిఆర్‌.. మేము ఎంతో భయపడ్డాం. విభజన తరవాత హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఉండేది. కానీ ఏడాదిలో ఏ ఒక్క ఘటనా జరగలేదు. అయినా హైదరాబాద్‌లో భద్రత లేదని ఏడాది తరవాత ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబు చెప్పడం దారుణమని ఎపి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, మాజీమంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు సి.రామచంద్రయ్య, శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ సెక్షన్‌-8 ఇప్పుడే గుర్తు వచ్చిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏపీ పీఎస్‌లు పెడతామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.  ఢిల్లీలోనూ ఏపీ పీఎస్‌లు పెడతారా అని నిలదీశారు. పాలన గాలికొదిలి ఓటుకు నోటుపై ఏపీ యంత్రాంగం పనిచేయడం సరికాదని సి.రామచంద్రయ్య, శైలజానాథ్‌ అన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేయాల్సిన అవసరం లేదని  రామచంద్రయ్య స్పష్టం చేశారు. ఒక వేళ సెక్షన్‌ 8ను అమలు చేస్తే ముందుగా చంద్రబాబే అరెస్టు అవుతారని తెలిపారు. ఇది తెలుసుకోకుండా బాబుతో సహా మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. మొదలు సెక్షన్‌ 8లో ఏముందో తెలుసుకోవాలని అన్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ కేబినేట్‌ సలహా మేరకు గవర్నర్‌ నడుచుకుంటారని, దీంతో ముందు బాబును ఓటుకు నోటులో అరెస్ట్‌ చేయాలని చెబుతారని అన్నారు. ఇది తెలుసుకోకుండా మాట్లాడడం తగదన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజలకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రజలకు సీఎం కేసీఆర్‌ పూర్తిగా రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. ఆంధ్రా ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌కు రామచంద్రయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం, మంత్రుల మాటలతోనే ఆంధ్రా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు బాబు పుణ్యమా అని సమస్యలు వస్తున్నాయని అన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో కెఎసిఆర్‌ ఏడాది పాలనను బేరీజు వేస్తే అసలు రంగు తెలుస్తుందన్నారు. బాబు ఈ వ్యవహారాన్ని ఎపి ప్రజల వ్యవహారంగా మార్చడం దారుణమన్నారు. ఇకపోతే చంద్రబాబు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్న తీరు అభాసు పాలయ్యిందన్నారు. ఇప్పటికే పలు విదేశీ పర్యటనలు చేసిన బాబు మరోమారు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళతానని అంటున్నారని అన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే పెట్టుబడులు వస్తాయా అని రామచంద్రయ్య ప్రశ్నించారు.  ప్రస్తుత ఎపిసోడ్‌లో బాబు విశ్వసనీయత దెబ్బతిందని, పొలిటికల్‌ కరప్షన్‌ వల్ల పెట్టుబడులు పెట్టేవారు వెనకడుగు వేస్తారన్నారు. ఇక తమాము టిఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యామని ఎపి మంత్రి దేవినేని ఆరోపించడాన్ని రామచంద్రయ్య ఖండించారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ వారు 13 జిల్లాల ఎపికి లాభం చేకూరేలా అనేక ప్రయత్నాలు చేస్తే, టిడిపి నేతలు ఎక్కడున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌తో కుమ్మక్కు కావాల్సిన అసవరం కాంగ్రెస్‌కు లేదన్నారు.