హైదరాబాద్ అందరికంటే ముందు
– గ్రేటర్ మెనిఫెస్టో విడుదల చేసిన టీఆర్‌ఎస్
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుందని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడం తమ ప్రధాన కర్తవ్యం అని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. ఇదే లక్ష్యంతో రూపొందించిన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మానిఫెస్టోని సీనియర్ నేతలు కె.కేశవరావు,డి.శ్రీనివాస్ లు విడుదల చేశారు. దుర్గం చెరువు వద్ద వంతెన నిర్మాణంతో సహా పలు హావిూలను ఇందులో ప్రస్తావించారు. ట్రాపిక్ చిక్కులు లేని ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ను ఏర్పాటు చేస్తామని ,నిరంతర విద్యుత్, స్వచ్ హైదరాబాద్ తయారుచేస్తామని టిఆర్‌ఎస్ తెలిపింది.నగరంలో ఉచిత వైఫై ఇస్తామని ,ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు నిబందనలు తీసుకు వస్తామని టిఆర్‌ఎస్ తెలిపింది.పదిహేడు చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం చేస్తామని , ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఆస్తి పన్ను తగ్గిస్తామని కూడా పేర్కొన్నారు. 15 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. మన హైదరాబాద్ అందరికంటే ముందు, అభివృద్ధిలో ముందు నినాదంతో మేనిఫెస్టో రూపకల్పన చేయడం విశేషం. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే, ప్రభుత్వ సలహాదారు డీఎస్ తదితరులు నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా ఔటర్ నిర్మాణం కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఘట్‌కేసర్, శావిూర్‌పేట రోడ్ నిర్మాణంతో ఈ ఏడాది చివరికి 158 కి.విూ. ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తి మూసీనదిపై తూర్పు నుంచి పడమర దిశగా 42 కిలోవిూటర్ల మేర 4 లైన్ల రోడ్ నిర్మాణం కూడా ప్రస్తావించారు. దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంతో టూరిజం అభివీద్దికి దోహదపడేలాచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇక నగరంలో ఇప్పటికే కరెంట్ కోతలు లేకుండా చేసిన ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా కల్పించింది. 3,500 కిలోవిూటర్ల మురుగునీటి కాల్వను ఆధునీకరణకు ఆవిూ ఇచ్చారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులు త్వరలో పూర్తిచేస్తామని హావిూ ప్రకటించారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల కొనుగోలు, ఉస్మాన్ సాగర్-హిమాయత్ సాగర్‌ల పునరుద్ధరణ, మూసీ సుందరీకరణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత తదితర అంశాలకరు ప్రాధాన్యత కల్పించారు. ఉచిత వైఫై కిరూ. 130 కోట్లఖర్చుచేయనున్నట్లు ప్రకటించారు. 200 మార్కెట్లు అభివృద్దిచేయడం కూడా తమ ప్రాధాన్యాల్లో ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సైక్లింగ్ ప్యాడ్స్, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత వంటి అంవౄలను పొందుపర్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం 13 మురికివాడల్లో 17 చోట్ల డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పటికే ప్రారంభించిన రూ. 5 కే భోజన కేంద్రాలను 200కు పెంచుతామన్నారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతి, రియల్ ఎస్టేట్ సంస్థలపై విధించే నాలా పన్ను ఎత్తివేత, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనల అమలు, ప్రభుత్వ బడుల విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యత పెంపు, ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్ తరగతుల నిర్వహణ, 50 శాతం సబ్సిడీపై మైనార్టీలకు వెయ్యి ఆటోల పంపిణీ, అన్ని గ్రంథాలయాలు ఆధునీకరణ కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో ఈ-లైబ్రరీల ఏర్పాటు, వాన నీటి సంరక్షణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు, నగరమంతా లక్షకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు రూ. 685 కోట్లు కేటాయింపు తదితర అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపర్చారు. .
హైదరాబాద్ అభివృద్దికి కట్టుబడే మేనిఫెస్టో: కెకె
గ్రేటర్ హైదరాబాద్‌లో నూతన శకానికి నాంది పలికేలా టీఆర్‌ఎస్ పార్టీ అజెండా విడుదల చేశామని ఆపార్టీ ఎంపీ కేకే అన్నారు. హైదరాబాద్ అభివృద్ది లక్ష్యంగానే సిఎం కెసిఆర్ అనేక చర్యలకు పూనుకున్నారని, ఇదే తమ నినాదం, విధానమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణభవన్‌లో ఆపార్టీ నేతలు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేకే మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఎక్కడికెళ్లిన బ్రహ్మరథం పడుతున్నరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాతినిథ్యం కల్పిస్తున్నాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 68 మంది బీసీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేసిన పనులు చేయబోయే కార్యక్రమాలతో మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందని ప్రభుత్వ సలహాదారు డీఎస్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలిసారి పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎన్నికల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. టీఆర్‌ఎస్ ఇచ్చిన హావిూలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ఓటర్లు భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు కొరుకుంటున్న మౌలిక అంశాలపై దృష్టిపెట్టినట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందరికంటే ముందు అభ్యర్థులను ఎంపిక చేశాం. అన్ని పార్టీలకంటే ముందు మేనిఫెస్టోను ప్రకటించాం. ప్రజలు కొరుకునే మౌళిక అంశాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. పురపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి తాగునీరు. శివారు మున్సిపాలిటీలకు రూ. 1900 కోట్లతో తాగునీరు ఏర్పాటుకు చర్యలు. ఏడాది చివరినాటికి ఔటర్ రింగ్‌రోడ్ పూర్తి చేస్తం. 23 మంది ముస్లీంలకు టికెట్లు ఇచ్చిన పార్టీ టీఆర్‌ఎస్. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా దాటదు. బీజేపీ నేతలు ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదనే సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హెచ్‌సీయూలో జరిగిన విద్యార్థి ఆత్మహత్య ఘటన దురదృష్టకరం. రోహిత్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదుకుంటమని మంత్రి వెల్లడించారు.