హైదరాబాద్‌ అభివృద్ధి నా వల్లే

1

తెలంగాణ మిగులు బడ్జెట్‌ నా వల్లే

మాది ఇక జాతీయ పార్టీ

మహానాడులో చంద్రబాబు

హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):   హైదరాబాద్‌ తన పాలనలోనే అభివృద్ధి చెందిందని తెలంగాణ మిగులు బడ్జెట్‌ తన ముందు చూపు వల్లే నని తెలుగు దేశం పార్టీ            అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 34 ఏళ్ల వయసులో ఇప్పుడు పార్టీ ఉందన్నారు.  గండిపేట వేదికగా తెలుగుదేశం పార్టీ 34వ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన టిడిపి శ్రేణులతో గండిపేట పసుపుమయమైంది.  అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విలువలకు, క్రమశిక్షణకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తలు రాజీలేనిపోరాటం చేశారని, సంఘటిత శక్తిగా, సాంకేతికంగా ఎదుగుతున్నామని ఆయన అన్నారు. శక్తిసామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలను చితన్యపరిస్తేనే ఫలితాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టలేదని, తెలుగు జాతి అభివృద్ధి కోసం పార్టీ పెట్టారని ఆయన పేర్కొన్నారు.  విలువలకు, క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.  అధికారం కోసమో, వ్యాపకం కోసమో పార్టీ పెట్టలేదని తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని తెలిపారు.

కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాల్లో ప్రజల గుణపాఠం

తెలుగువారికి అనైక్యతే తప్ప … స్వార్థం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాజకీయ ధోరణితో,సంకుచిత స్వభావంతో కాంగ్రెస్‌ ఇష్టరాజ్యంగా  రాష్ట్రాన్ని  విభజించిందన్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను చీల్చిచెండాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన విషయంలో అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు ఆ పార్టీ నాయకులు తగుదునమ్మా అని ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన విధానాలవల్ల భూస్థాపితం అయ్యిందని, ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టుకే అక్రమమని అభివర్ణిస్తూ ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నాను – విూకు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు లేకపోతే ఎందుకు ఖండించడంలేదు అని ఆయన ప్రశ్నించారు. విూరు ఎందుకు మాట్లాడడం లేదు, ప్రభుత్వంతో ఎందుకు సహకరించడంలేదు అని ఆయన అడిగారు. విూరు లాలూచీపడ్డారు కాబట్టే ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలను ఖండించడానికి ముందుకు రావడంలేదని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ముప్పై ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉన్నా తాము సొంతంగా పేపరు పెట్టే పరిస్థితి గాని, సొంతంగా టివి చానల్‌ పెట్టే పరిస్థితి కాని లేదని, కాని వైఎస్సార్‌ పార్టీ మాత్రం అక్రమ ఆర్జనతో సొంతంగా పేపర్‌, టివి చానల్‌ పెట్టిందని ఆయన గుర్తుచేశారు.  కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా రాజీలేని పోరాటం చేశామన్నారు.

తెలుగువారిగా కలిసే ఉండాలి

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా మనమంతా మానసికంగా కలిసివుండాలని చంద్రబాబు నాయుడు అన్నారు. విద్వేషాలు, విభేదాల వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని మరోమారు  ప్రకటించారు. నాయకులు సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రజలతో ఎప్పికటికప్పుడు సన్నిహత సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. మనం చేసే పనుల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. దేశంలో ట్రెండ్‌ సెట్‌ చేయాలంటే టీడీపీకే సాధ్యమని సీఎం అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావనతో ముందుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని వివరించారు. తెలుగుదేశం పార్టీ నవయవ్వనంలో ఉందని, ఏదైనా చేయగల సత్తా ఉందని చంద్రబాబు అన్నారు. విలువలకు, క్రమశిక్షణకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు కార్యకర్తలు రాజీలేనిపోరాటం చేశారని, సంఘటిత శక్తిగా, సాంకేతికంగా ఎదుగుతున్నామని ఆయన అన్నారు. శక్తిసామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరిస్తేనే ఫలితాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.  అభివృద్ధి చేసి చూపించిన పార్టీ టీడీపీనే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. విష్యత్‌ కార్యక్రమాలకు పునరంకితమయ్యే వేదిక మహానాడు అని,ఎన్ని ఇబ్బందులు వచ్చినా విధిగా మహానాడును నిర్వహించామన్నారు. పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని వారిని ఎప్పటికీ మరిచిపోనని చంద్రబాబు పేర్కొన్నారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ రాజీలేని పోరాటం చేశారన్నారు. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి పోయినా నష్టమేవిూ లేదని….ఇంకా పార్టీ బలోపేతం అవుతుందే తప్ప బలహీనపడలేదన్నారు. టీడీపీ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు పెట్టి నూతన విధానానికి నాంది పలికామన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాస్వామ్యయుతంగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా టెక్నాలజీ ద్వారా 50 రోజుల్లో 50 లక్షల మంది సభ్యత్వంతో రికార్డు సాధించామన్నారు. కార్యకర్తల సంక్షేమంకోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా సదుపాయాన్ని ప్రవేశపెట్టామన్నారు.