హైదరాబాద్ కు హాలీవుడ్ డ్రీమ్‌వర్క్
– కంపెనీ సీఈవోతో కేటీఆర్ భేటి
– పెట్టుబడులకు పలు సంస్థలు సంసిద్ధత
అమెరికాలో కొనసాగుతున్న కెటిఆర్ పర్యటన
హైదరాబాద్,మే28(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ లాస్ ఏంజెల్స్‌లో పర్యటిస్తున్నారు. డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయంలో సీఈవో జెఫ్రీ కాట్జన్ బర్గ్‌ను కేటీఆర్ కలిశారు. అద్భుతమైన విజన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డ్రీమ్ వర్క్స్ స్పష్టం చేసింది. అనంతరం లాస్ ఏంజెల్స్ క్లీన్‌టెక్ ఇంక్యుబేటర్‌ను మంత్రి సందర్శించారు. అద్భుతమైన విజన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకొస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ అయిన డ్రీమ్ వర్క్స్ ,తన వ్యాపార విస్తరణకు తెలంగాణను ఎంచుకుంది. అమెరికా టూర్ లో భాగంగా ఐదో రోజు లాస్ ఏంజెల్స్ లో పర్యటించిన ఐటీ,పురపాల శాఖ మంత్రి డ్రీమ్ వర్క్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. జెఫ్రీ కాట్జన్ బర్గ్ ను కలుసుకున్న కేటీఆర్, ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు గురించి వివరించారు. భారత్ లో విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ, సమర్థ నాయకత్వంలో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామని అన్నారు. ఇంతేకాదు తమ సినిమాల ప్రమోషన్ కోసం హైఎండ్ ఎకోసిస్టమ్ తో ఒక థియేటర్ ను నిర్మిస్తామని అందుకు సహకరించాలని మంత్రిని జెఫ్రీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్, డ్రీమ్ వర్క్స్ కు
చేతనైనంత సహాయం చేస్తామని హామి ఇచ్చారు. డ్రీమ్ వర్క్స్ విస్తరణకు అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్ లో నిర్మించే ఫిల్మ్ సిటీ అత్యంత అనుకూలంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో చిన్నతరహా థీమ్ సెంటర్, డ్రీమ్ ప్లేను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్ వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. హైదరాబాద్ వచ్చి భారత మార్కెట్‌అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ కోరారు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్ ఇన్నోవేషన్ సెంటర్ క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ ను తారకరామారావు సందర్శించారు. నీటి సంరక్షణతో పాటుమురుగునీటి శుద్దిలో వినూత్నమైన పద్దతులను అవలంబిస్తున్న క్లీన్ టెక్ పనితీరు, విజయవంతమైన తీరును కేటీఆర్ తెలుసుకున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన టీ హబ్ గురించి వివరించి తగిన సహకారం అందించాలని, కలిసి పనిచేయాలని కోరారు. ఇంక్యుబేటర్ సీఈఓను హైదరాబాద్ రావాలని మంత్రి ఆహ్వానించారు.




