హైదరాబాద్‌ బ్రాండ్‌కు ఎవరూ వారసులు కాదు

హైదరాబాద్‌ నగరం చారిత్రకంగా ఎంతో భాసిల్లింది. ఇక్కడ తరతమ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగానే ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. ఇది ఎవరో కొందరి వల్ల రాలేదు. తమరక్తం ధారపోసి కట్టామని రాయలసీమకు చెందిన టిజి వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. హైదరాబాద్‌ను ఓ రకంగా సీమ గూండాలు ఆక్రమించుకుని సర్వనాశనం చేశారు. ఇక్కడి భూములను ఆక్రమించుకుని అడ్డదిడ్డంగా ఇళ్లు కట్టి సొమ్ము చేసుకున్నారు. హైటెక్‌ సిటీ ఎంత డొల్లగా నిర్మితమయ్యిందో డ్రైనేజీ వ్యవస్తను చూస్తే అర్థం అవుతుంది. అలాంటి కొందరు రియల్టర్ల పాపానికి ప్రజలు బలవుతున్నారు. ఎప్పుడు వర్షాలు పడ్డా భారీ వర్షాల దెబ్బకుచెన్నై, ముంబయి, దిల్లీ వంటి మహా నగరాలు కుదేలయ్యాయని మాత్రమే చూస్తున్నాం. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు వర్ష నీటి ప్రవాహాలకు ఉద్దేశించిన నాలాలెన్నో అక్రమ నిర్మాణాల బారిన పడడంతో రాజధాని నీటమునగడానికి కారణభూతమైంది. అందుకే హైదరాబాద్‌లో గుర్తించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం, నాలాల ఆక్రమణలను తొలగించడం కోసం సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇంకా పక్కాగా అమలు కావాల్సి ఉంది. నగరంలో ఇకముందు ఇలా చేస్తే దండన తప్పదన్న రీతిలో చర్యలుండాలి. ప్రధానంగా ఇందుకు బాధ్యులైన రాజకీయ నేతలను గుర్తించాలి. వారిపై కఠిన ఆంక్షలు విధించాలి. రాజకీయ నాయకుల ఆక్రమణల వల్లనే ఇవాళ నగరం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కఠినంగా వ్యవహరిస్తున్నా ఇంకా అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలు ఇటీవల కనిపిస్తున్నాయి. వీటిని గుర్తించిన మంత్రి కెటిఆర్‌ ఆదేశాలు ఇవ్వడంతో బల్దియా ఇటీవల కూల్చివేతలకు సిద్దపడింది. అయినా అక్కడక్కడా చెరువలను ఆక్రమిస్తూనే ఉన్నారు. గతంలో బండారి లే అవుట్‌లో వర్షాలకు ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో గమనించాం. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు పూనుకోవాలి. ఇష్టం వచ్చినట్లుగా లేఔట్లు వేసి, చెరువులను కబ్జాచేసిన పాపానికి ఫలితం కనిపిస్తున్నా ఇంకా వేచిచూసే ధోరణి సరికాదు. అందుకే సిఎం కెసిఆర్‌ తీసుకునే నిర్ణయం మేరకు ఆక్రమణల తొలగింపులో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇదే సందర్భంలో ఇందుకు బాధ్యులైన గత అధికారులు, బిల్డర్లు, రియల్టర్లపై చర్యలు తీసుకుంటేనే భయం ఉంటుంది. కిర్లోస్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం 390 కి.విూ. నాలాలుంటే, మూసీకి దారితీసే 170 నాలాలపై నూరు శాతం అక్రమ నిర్మాణాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. వాటన్నింటినీ తొలగిస్తామంటున్న కేసీఆర్‌, ఇక ముందూ అక్రమ నిర్మాణాల్ని ఉపేక్షించేది లేదన్నారు. రాజధానిలో 165 చెరువులు అసలు కనిపించడమే లేదని రెవిన్యూ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించిన మహానగర పాలక సంస్థ అధికారులు బిల్డర్లతో లాలూచీపడి అక్రమ నిర్మాణాలకు కారణ భూతులయ్యారు. అనుమతులు ఇచ్చిన అధికారుల్ని, సంపాదించిన బిల్డర్లను వదిలేసి, జీవితకాల కష్టార్జితాన్ని ధారపోసి ఇళ్లు కొనుక్కొన్న వారు కొనుక్కున్న వారిని రోడ్డున పడేయరాదు. ఈ ఇళ్లను కట్టి అక్రమంగా సంపాదించిన బిల్డర్లను అధికారులను దోషులనుచేయాలి. వీరు నష్టపోయే మొత్తం వారు చెల్లించేలా చూడాలి. దీనిని ప్రభుత్వం గుర్తించాలి. నిజానికి ప్లాట్లు వేసిన సందర్భంలో లేదా అనుమతి ఇచ్చిన సందర్బంలో కనీసం రిజిస్టేష్రన్‌ సందర్భంలోనే వీటిని అరికట్టాలి. అక్రమ కట్టడాల తొలగింపులో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామన్న సర్కారు, ముందువారికి ఆవాసాలు చూపించాకే వాళ్లను ఖాళీ చేయించాలి. అసాధారణ వర్షాలు వచ్చినప్పుడుసమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎక్కడైతే నాలాలను అక్రమంగా ఆక్రమంచుకున్నారో అక్కడే నీట మునుగుతున్నాయి. అయినా నగరంలో నిర్మించిన అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాల్సిందే. హైదరాబాద్‌లో ఈ దుస్థితికి గత ప్రభుత్వాలే కారణం. హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలున్నాయి.గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల నాలాల స్థలాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించారు. గతంలో తప్పు చేసిన వారిని ఉపేక్షించడం కూడా తప్పే అవుతుంది. అందువల్ల కబ్జాలకు కారకులైన నాటి అధికారులతో సమా అందరినీ బాధ్యులను చేయాలి. అక్రమ కట్టడాల వల్లే నగరంలో ఈ పరిస్థితి వచ్చిందని సిఎం పేర్కొన్నందున బాధ్యులను కూడా గుర్తించచర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదు. మూసి నది నాలాలపై 28వేల అక్రమ కట్టడాలను గుర్తించినట్టు వెల్లడించారు. ఈ అక్రమ కట్టడాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బిల్డర్లను నమ్మి అధికారులు ఇచ్చిన లే ఔట్‌ పర్మిషన్లు నమ్మి కొనుగోలు చేసిన ఉద్యోగులను మాత్రమే బలి చేయరాదు. ఈ విషయంలో గతాన్ని తవ్వాల్సిందే. గత పాలకుల పాపాలను వెలికి తీయాల్సింది. వర్షాల వల్ల వేసిన రోడ్లు వేసినట్లుగా దెబ్బతింటున్నాయి. మామూలు వర్షాలకు కూడా కొట్టుకుని పోయే నాణ్యత మన రోడ్లకు ఉందని గుర్తించాలి. వీటన్నిటిపైనా చర్య తీసుకుంటే నగరం బాగుపడిందని ప్రజలు సంతోషిస్తారు.