గో ‘రక్షక’ ముఠాలను ఎందుకు నిషేధించొద్దో చెప్పండి

‘గోసంరక్షక ముఠాల’ను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఆరు రాష్ట్రాల కు నోటీసులు జారీ చేసింది. ఆవు రక్షణ పేరుతో ఈ ముఠాలు దళితులపై, మైనార్టీలపై పాల్పడుతు న్న హింస నేపథ్యంలో గో ముఠాలను నిషేధించడంపై మూడు వారాల్లో తమ వైఖరి తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ముఠాలను నిషేధించాలని కోరుతూ హక్కుల కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పున్వాలా గతేడాది అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ ఎఎం ఖాన్‌ విల్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. గో ‘రక్షక’ ముఠాలను ఎందుకు నిషేధించకూడదో చెప్పాలని ఆదేశించింది. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మే 3వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా గోసంరక్షణ పేరుతో ఇటీవల రాజస్థాన్‌ అల్వార్‌లో పెహ్లుఖాన్‌ను కొట్టిచంపిన ఉదంతాన్ని పిటిషనర్‌ తరపు న్యాయ వాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాజ్యం లో గత రెండు సంవత్సరాలుగా ఈ ముఠాలు పాల్పడిన సుమారు పది హింసాత్మక ఘటనలను పిటిషన్‌లో పొందుపరిచారు. గుజరాత్‌లోని ఉనా పట్టణంలో దళితులపై దాడితో పాటు యూపీలోని అఖ్లాక్‌ హత్య వరకు అన్ని వివరించారు.

తాజావార్తలు