హైదరాబాద్ నగరానికి మరో ఘనత

హైదరాబాద్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో వేసే మార్కుల్లో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరాలదే ప్రధాన పాత్ర. పూర్తి ఓడీఎఫ్ నగరాలకు 900 మార్కులు కేటాయించింది కేంద్రం. అయితే, నగరంలో ఉన్న 150వార్డుల్లో కేవలం 112 మాత్రమే ఓడీఎఫ్‌లుగా ఉండడంతో… గత ఏడాది స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని ప్రభుత్వం భావించింది. ఫలితంగా గతంలో ప్రకటించిన 434 స్వచ్ఛ్ సర్వేక్షన్‌ నగరాల జాబితాలో హైదరాబాద్ 733 మార్కులతో 22వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం… హైదరాబాద్‌ ను ఓడీఎఫ్‌గా మార్చేందుకు కసరత్తు చేసింది.

ఈ ఓడీఎఫ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలో ఉన్న మొత్తం మురికి వాడల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. అయితే.. ప్రభుత్వ, రైల్వే స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఉన్న వారిని మరుగుదొడ్లు కట్టుకోవడానికి అధికారికంగా అనుమతివ్వడం కుదరదు. అయినప్పటికీ వారు ముందుకొస్తే మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతినిచ్చింది ప్రభుత్వం. మురికి వాడల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం సరిపడని ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించింది జీహెచ్ఎంసీ. పలు సమస్యాత్మక స్థలాల్లో ఉన్న మురికి వాడల్లో ప్రి-ఫ్యాబ్రికేటేడ్ మరుగుదొడ్లను నిర్మించింది. ఇప్పటి వరకు 150 వార్డుల్లో సరిపడా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు

హైదరాబాద్‌ను ఓడీఎఫ్ గా ప్రకటించడం వల్ల ఈ ఏడాది నిర్వహించే స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో మంచి మార్కులు సాధిస్తామని భావిస్తోంది జీహెచ్ఎంసీ. స్వచ్ఛ్ సర్వేక్షన్-2018 లో 4 వేల 41 నగరాలు పోటీ పడనున్నాయి. గత సర్వేలో పారిశుద్ధ్య పనులకు 2 వేల మార్కులు ఉండగా.. ఈ ఏడాది 4 వేల మార్కులు కేటాయించారు.

ప్రభుత్వం కృషి, జీహెచ్‌ఎంసీ పట్టుదలతో దేశంలోనే మొదటి ఓడీఎఫ్ నగరంగా అవతరించబోతోంది హైదరాబాద్‌. ఓడీఎఫ్ ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలవడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.