హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లో గాలికి ప్లాట్‌ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. వరంగల్, నర్సంపేట, ములుగు రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరకాలలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. జనగామ జిల్లాలోని నర్మెట్ట, తరిగొప్పులలో వడగండ్ల వానకు వరిచేను దెబ్బతింది.