హైద్రాబాద్‌కు మరో ఓటమి ఈడెన్‌లో కోల్‌కతాదే విజయం
కోల్‌కత్తా, డిసెంబర్ 17: ఈ ఏడాది రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం బౌలర్లే ఆధిత్యం కనబరిచారు. 7 వికెట్లకు 172 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరా బాద్ కాసేపటికే ఆలౌటైంది. దీంతో 181 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బెంగాల్ బరిలోకి దిగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్ కావడంతో ఆది నుండే తడబడింది. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బెంగాల్‌ను ఓపెనర్ బెనర్జీ, వృధ్ధిమాన్ సాహా ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు నాలుగో వికెట్‌కు కీలకమైన 79 పరుగుల పార్టనర్‌షిప్ సాధించారు. తర్వాత బెనర్జీ 56 పరుగులకు ఔటైనా.. సాహా, శుక్లాతో కలిసి విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో బెంగాల్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో బెంగాల్ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి.