హోం మంత్రిచే నుమాయిష్‌ ప్రారంభం

– మాజీ మంత్రి ఈటల రాజేందర్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జనవరి 1న నుమాయిష్‌ను హోం మంత్రి మహమూద్‌అలీ ప్రారంభిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నుమాయిష్‌ను 78 సంవత్సరాలుగా ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ నుమాయిష్‌ చాలా ప్రాచుర్యం పొందిందన్నారు. ఎగ్జిబిషన్‌
తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారని పేర్కొన్నారు. నుమాయిష్‌లో 2500లకు పైగా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు గల చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నుమాయిష్‌లో తమ స్టాల్‌ ఉండాలని వ్యాపారులు కోరుకోవడం మా ఘనత అన్నారు. ఈసారి ఎగ్జిబిషన్‌ మైదానానికి మెట్రో అనుసంధానం కావడం లాభదాయకమని ఈటెల తెలిపారు. ఇక్కడ ఉచిత పార్కింగ్‌ సదుపాయం సైతం కలదన్నారు. ఎగ్జిబిషన్‌ ప్రాంతంలో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సేవలు అందించేందుకు యశోద గ్రూప్‌ సంస్థలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ ద్వారా అందే డబ్బుతో 18కళాశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి చేస్తున్నామని ఈటెల తెలిపారు.