హోదాపై హైకమాండ్ ఆదేశం: అన్నీ పక్కన పెట్టి సభకు చిరంజీవి

chiranjeevi-bigన్యూఢిల్లీ: 150వ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప్రముఖ సినీ నటులు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి శుక్రవారం నాడు పార్లమెంటులో ప్రత్యక్షమయ్యారు. సొంత పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు చర్చ, ఓటింగ్‌కు అవకాశముంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్.. పార్టీ ఎంపీలకు రెండు రోజుల క్రితం విప్ జారీ చేసింది. కేవీపీ బిల్లు నేపథ్యంలో అందరూ సభలో ఉండాలని మూడు లైన్ల విప్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో చిరంజీవి శుక్రవారం నాడు రాజ్యసభకు హాజరయ్యారు. పార్లమెంటులో సంచితో దర్శనం ఇచ్చారు. కారు దిగి ఆయన పార్లమెంటులోకి అడుగు పెట్టారు.
బిల్లు పైన చర్చ జరిగి, ఓటింగు జరిగితే తప్పనిసరిగా ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సినిమా షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ విశ్రాంతి ఇచ్చి వచ్చారు.

విభజన నేపథ్యంలో ఏపీకి అయిదేళ్ల పాటడు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు.
నాడు, చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేక హోదాతో పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని పట్టుబట్టారు.